Belal Hossain: బంగ్లాదేశ్‌లో అరాచకం: ఇంటికి బయట తాళం వేసి నిప్పు.. చిన్నారి సజీవ దహనం!

Belal Hossains Home Attacked in Bangladesh Daughter Killed
  • బీఎన్‌సీ నేత బేలాల్ హొస్సేన్ నివాసంపై దుండగుల దాడి
  • తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఘాతుకం
  • ప్రాణాపాయ స్థితిలో బేలాల్ ఆయన ఇద్దరు కుమార్తెలు
బంగ్లాదేశ్‌లో అరాచకం హద్దులు దాటుతోంది. రాజకీయ కక్షల వల్ల ఒక పసి ప్రాణం బలవగా, ఒక కుటుంబం మొత్తం ప్రాణాపాయ స్థితిలో ఉంది. లక్ష్మీపూర్ సదర్ ఉపజిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన సంచలనం సృష్టిస్తోంది.

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నేత, వ్యాపారవేత్త బేలాల్ హొస్సేన్ నివాసమే లక్ష్యంగా దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘాతుకం జరిగింది. దుండగులు పథకం ప్రకారం ఇంటికి ఉన్న రెండు తలుపులకు బయట నుంచి తాళం వేశారు. అనంతరం ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీనివల్ల లోపల ఉన్న వారు బయటకు రావడానికి వీలు లేకుండా పోయింది.

ఈ అగ్నిప్రమాదంలో బేలాల్ హొస్సేన్ ఏడేళ్ల కుమార్తె అయేషా అక్తర్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. బేలాల్‌తో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు సల్మా అక్తర్ (16), సమియా అక్తర్ (14)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి శరీరాలు 50-60 శాతం వరకు కాలిపోయాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఢాకాలోని బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఇనిస్టిట్యూట్‌కు తరలించారు.

కళ్లముందే కాలిపోయిన ఇల్లు
బేలాల్ తల్లి హేజరా బేగం ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. "అర్ధరాత్రి కిటికీలోంచి చూస్తే నా కొడుకు ఇల్లు మంటల్లో ఉంది. కేకలు వేస్తూ పరుగెత్తాను, కానీ తలుపులకు బయట నుంచి తాళం వేసి ఉంది. నా కొడుకు ఎలాగోలా తలుపులు బద్దలుకొట్టి బయటపడ్డాడు. కోడలు తన నాలుగు నెలల పసికందును, ఆరేళ్ల కొడుకును రక్షించుకోగలిగింది. కానీ లోపల పడుకున్న మనవరాళ్లు మంటల్లో చిక్కుకుపోయారు" అని కన్నీరుమున్నీరయ్యారు.

ఈ కేసులో నిందితులు ఎవరు? ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు లక్ష్మీపూర్ మోడల్ థానా పోలీసులు తెలిపారు.
Belal Hossain
Bangladesh arson attack
Lakshmipur fire incident
BNP leader
political violence Bangladesh
crime news
child death
fire accident
Bangladesh Nationalist Party
Dhaka burn institute

More Telugu News