IndiGo: ఈ నెల‌ 26 నుంచి పరిహారం.. ఇండిగో కీలక ప్రకటన

IndiGo to Issue Compensation from 26th
  • విమానాల రద్దుతో ఇబ్బందిపడ్డ ప్రయాణికులకు ఇండిగో పరిహారం
  • అదనంగా రూ.10,000 ట్రావెల్ వోచర్
  • ఈ నెల‌ 26 నుంచి పరిహారం చెల్లింపులు ప్రారంభం
  • పరిహారం ప్రక్రియను పర్యవేక్షించనున్న కేంద్ర విమానయాన శాఖ
ఇటీవల విమానాలను భారీగా రద్దు చేసి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్, వారికి పరిహారం చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఈ నెల‌ 3, 4, 5 తేదీల్లో విమానాశ్రయాల్లో గంటల తరబడి చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఈ నెల‌ 26 నుంచి రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్లను జారీ చేయనుంది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన రూ.5,000 నుంచి రూ.10,000 పరిహారానికి ఇది అదనం. విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ సిన్హా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన ప్రయాణికులందరికీ తక్షణమే చెల్లింపులు జరిగేలా చూడాలని ఇండిగోను ప్రభుత్వం ఆదేశించింది.

నేరుగా ఇండిగో వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి వారం రోజుల్లోగా చెల్లింపులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. ట్రావెల్ ఏజెంట్లు, ఆన్‌లైన్ పోర్టళ్ల నుంచి ప్రయాణికుల వివరాలు సేకరించి, వారికి కూడా నేరుగా పరిహారం అందించాలని ఇండిగోకు సూచించారు. ఈ ప్రక్రియను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్ సేవా పోర్టల్ ద్వారా విమానయాన శాఖ పర్యవేక్షించనుంది.

రద్దయిన విమానాలకు సంబంధించి ఇండిగో రిఫండ్లు ప్రారంభించినప్పటికీ, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా బుక్ చేసుకున్న చాలా మందికి ఇంకా డబ్బులు అందలేదని తెలుస్తోంది. డీజీసీఏ ఆదేశాలతో మేక్‌ మై ట్రిప్ సంస్థ ఇండిగో నుంచి డబ్బులు రాకముందే దాదాపు రూ.10 కోట్లు రిఫండ్ చేసినట్లు సమాచారం. మరోవైపు భవిష్యత్తులో ఇలాంటి భారీ వైఫల్యాలు పునరావృతం కాకుండా సమస్య మూలాలను గుర్తించడానికి బయటి సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తామని ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా తెలిపారు.

ఈ నెల‌ 8 నుంచి తమ నెట్‌వర్క్‌లోని అన్ని గమ్యస్థానాలకు విమాన సేవలు పూర్తిగా పునరుద్ధరించామని, 9 నుంచి కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని కంపెనీ పేర్కొంది.
IndiGo
IndiGo Airlines
flight cancellations
travel vouchers
compensation
Sameer Sinha
Vikram Singh Mehta
DGCA
refunds

More Telugu News