Maya Tissafi: వారణాసి రోప్‌వే పనులపై స్విస్ రాయబారి ప్రశంసలు

Varanasi Urban Ropeway Construction Praised by Swiss Envoy Maya Tissafi
  • వారణాసి రోప్‌వే ప్రాజెక్టును పరిశీలించిన స్విస్ రాయబారి
  • డిసెంబర్ 31 నాటికి 5 స్టేషన్ల నిర్మాణం పూర్తి చేయాలని యూపీ సర్కార్ ఆదేశం
  • దేశంలోనే మొట్టమొదటి ప్రజా రవాణా రోప్‌వేగా గుర్తింపు
  • 45 నిమిషాల ప్రయాణం ఇక కేవలం 15 నిమిషాలకు తగ్గింపు
  • స్విస్ టెక్నాలజీతో రూ.815 కోట్లకు పైగా వ్యయంతో నిర్మాణం
  • ఈ రోప్ వే ప్రాజెక్టు నిర్మాణం జరుపుతున్న తెలుగు సంస్థ విశ్వ సముద్ర ఇంజినీరింగ్
కాశీ విశ్వనాథుడి క్షేత్రం వారణాసిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అర్బన్ రోప్‌వే ప్రాజెక్ట్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా స్విట్జర్లాండ్ రాయబారి మాయా టిస్సాఫీ శనివారం ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మరింత వేగవంతం చేసేందుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 నాటికి మొత్తం 5 స్టేషన్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను హైదరాబాద్‌కు చెందిన విశ్వ సముద్ర ఇంజినీరింగ్ సంస్థ, స్విస్ కంపెనీ బార్తోలెట్ సంయుక్తంగా చేపడుతున్నాయి. భారతదేశంలోనే మొట్టమొదటి ప్రజా రవాణా రోప్‌వే వ్యవస్థగా ఇది చరిత్ర సృష్టించనుంది. మొత్తం 3.8 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ రోప్‌వే, వారణాసి కంటోన్‌మెంట్ రైల్వే స్టేషన్ నుంచి గోదౌలియా చౌక్ వరకు ప్రయాణికులను చేరవేస్తుంది. ఈ మార్గంలో కాశీ విద్యాపీఠ్ (భారత్ మాతా మందిర్), రథ్ యాత్రా, గిర్జా ఘర్ వద్ద మరో మూడు ఇంటర్మీడియట్ స్టేషన్లు ఉంటాయి. మొత్తం 5 స్టేషన్లు, 29 టవర్ల నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది.

స్విస్ రాయబారి మాయా టిస్సాఫీ తన పర్యటనలో భాగంగా క్యాంట్, రథయాత్ర, కాశీ విద్యాపీఠ్ స్టేషన్లను సందర్శించి పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెతో పాటు నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (NHLML) అధికారులు, రోప్‌వే నిర్మాణంలో సాంకేతిక భాగస్వామిగా ఉన్న స్విస్ సంస్థ బార్తోలెట్ నిపుణులు కూడా ఉన్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "ఈ ప్రాజెక్టు వారణాసి వచ్చే పర్యాటకులకు, స్థానిక ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, భద్రతకు పెద్దపీట వేస్తూ రోప్‌వేను నిర్మించడం అభినందనీయం" అని కొనియాడారు. 

కాశీ నగరంలోని ఇరుకైన వీధులు, తీవ్రమైన ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. సాధారణంగా రోడ్డు మార్గంలో కంటోన్‌మెంట్ నుంచి గోదౌలియా చౌక్‌కు చేరుకోవడానికి 45 నుంచి 50 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఈ రోప్‌వే ద్వారా ఆ ప్రయాణ సమయం కేవలం 15 నిమిషాలకు తగ్గిపోనుంది. ఇది స్థానికులకే కాకుండా, కాశీకి వచ్చే లక్షలాది మంది భక్తులకు, పర్యాటకులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా, పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 మార్చి 24న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.815.58 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 25 సంవత్సరాల పాటు నిర్వహణ, మరమ్మతుల ఖర్చులు కూడా కలిసి ఉన్నాయి. అత్యాధునిక యూరోపియన్ భద్రతా ప్రమాణాలతో, సెన్సర్లు, ఆటోమేటిక్ వ్యవస్థ, ఎమర్జెన్సీ బ్యాకప్ వంటి సదుపాయాలతో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. 

Maya Tissafi
Varanasi Ropeway
Urban Ropeway Project
Kashi Vishwanath
Switzerland Ambassador
Uttar Pradesh
Ropeway Construction
Tourism
Kashi
India

More Telugu News