Chandrababu Naidu: చిన్న ఆలోచనలే ఒక్కోసారి గొప్ప అభివృద్ఢికి బాటలు వేస్తాయి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Launches Mustaabu Program for Student Development
  • అనకాపల్లిలో 'ముస్తాబు' కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అమలుకు నిర్ణయం
  • వ్యక్తిగత శుభ్రత, ఆత్మవిశ్వాసం పెంచడమే కార్యక్రమ లక్ష్యం
  • పార్వతీపురం మన్యం కలెక్టర్ ఆలోచనను ప్రశంసించిన ముఖ్యమంత్రి
  • త్వరలో 75 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటన
చిన్న చిన్న ఆలోచనలు ఒక్కోసారి అభివృద్ధికి, గొప్ప మార్పులకు బాటలు వేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొన్ని ఆలోచనలు సమాజంలో విప్లవాత్మక మార్పులు తెస్తాయని, 'ముస్తాబు' అలాంటి కార్యక్రమమేనని తెలిపారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ముస్తాబు' కార్యక్రమాన్ని ఆయన శనివారం లాంఛనంగా ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 'ముస్తాబు కార్నర్'ను సీఎం పరిశీలించి, విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటించారు.

ఈ కార్యక్రమం నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అమలు కానుందని చంద్రబాబు ప్రకటించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఒక అధికారి చొరవతో మొదలైన మంచి పనిని రాష్ట్రమంతటా అమలు చేస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "విద్యార్థుల్లో వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. పాఠశాలకు చక్కటి యూనిఫాంతో, పరిశుభ్రంగా రావాలి. చక్కగా తల దువ్వుకోవడం, భోజనానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవడం వంటి మంచి అలవాట్ల వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఈ ముస్తాబు కార్యక్రమానికి అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల విద్యార్థుల్లో చదువుపై శ్రద్ధ పెరగడమే కాకుండా, నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయి" అని వివరించారు.

రాష్ట్రంలోని 75 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. "మీరంతా రాష్ట్రానికి గొప్ప ఆస్తి. అందుకే అమ్మకు వందనం ద్వారా ఆర్థిక సాయం, నాణ్యమైన పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తున్నాం. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలంటే చిన్నతనం నుంచే కృషి చేయాలి. విద్యార్థులంతా నాలెడ్జ్ ఎకానమీలో భాగం కావాలి" అని ఆకాంక్షించారు.

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యారంగంలో వినూత్న సంస్కరణలు తీసుకొస్తున్నారని, విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మంత్రులందరూ కృషి చేస్తున్నారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Mustaabu Program
Andhra Pradesh
Student Hygiene
Nara Lokesh
Education Reforms
Anakapalli District
Health Checkups
Government Schools
Parvathipuram Manyam

More Telugu News