అందరూ నాతో ఫ్లర్ట్ చేస్తారు.. కానీ నేను వెళ్లేది అతని దగ్గరికే: ప్రియాంక చోప్రా

  • భర్త నిక్ జోనస్ చాలా రొమాంటిక్ అని చెప్పిన ప్రియాంక చోప్రా
  • కర్వా చౌత్ రోజు ప్లేన్‌లో మేఘాల పైకి తీసుకెళ్లి ఉపవాసం విరమింపజేశాడని వెల్లడి
  • కపిల్ శర్మ షోలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు పంచుకున్న ప్రియాంక
స్టార్ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా తన భర్త, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ఎంతటి రొమాంటిక్ మనిషన్న విషయాన్ని ఓ ఆసక్తికర సంఘటనతో పంచుకున్నారు. కర్వా చౌత్ పండుగ రోజున ఉపవాస దీక్ష విరమించేందుకు, చంద్రుడిని చూపించడానికి నిక్ తనను ప్రత్యేకంగా విమానంలో మేఘాల పైకి తీసుకెళ్లాడని ప్రియాంక వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమె నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో అతిథిగా పాల్గొన్నప్పుడు తెలిపారు.

ఈ షోలో కపిల్ శర్మ సరదాగా.. "ఇక్కడ నేను మీతో ఫ్లర్ట్ (సరసమాడటం) చేస్తే సబ్‌టైటిల్స్ వస్తాయి. ఒకవేళ నిక్ అది చదివితే ఎలా?" అని అడగ్గా, ప్రియాంక నవ్వుతూ సమాధానమిచ్చారు. "నిక్‌కు ఇలాంటివి అలవాటే. అందరూ నాతో ఫ్లర్ట్ చేస్తారని అతనికి తెలుసు. కానీ రోజు చివరికి నేను ఇంటికి వెళ్లేది అతని దగ్గరికే కదా" అంటూ తన భర్తపై ఉన్న నమ్మకాన్ని తెలియజేశారు. ఒకానొక మ్యూజిక్ వీడియోలో నిక్‌ను చూశాకే, అతనితో డేట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నానని ఆమె గుర్తుచేసుకున్నారు. 

ఇక సినిమాల విషయానికొస్తే, ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వార‌ణాసి' సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉన్నారు. దీంతో పాటు హృతిక్ రోషన్ తొలిసారిగా దర్శకత్వం వహించనున్న ‘క్రిష్ 4’లో కూడా ఆమె నటించనున్నారు. అలాగే ‘ది బ్లఫ్’ అనే యాక్షన్ డ్రామాలో 19వ శతాబ్దానికి చెందిన పైరేట్‌గా కనిపించనున్నారు. ఆమె చివరిసారిగా ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ చిత్రంలో జాన్ సెనా, ఇద్రిస్ ఎల్బాలతో కలిసి నటించారు.


More Telugu News