Harish Rana: 13 ఏళ్ల నరకం.. యువకుడి కారుణ్య మరణంపై ఉత్కంఠ.. జనవరి 13న తుది విచారణ

Harish Rana Euthanasia Plea Supreme Court Final Hearing on January 13
  • హరీశ్ రాణా కేసులో తుది నిర్ణయం తీసుకోనున్న సుప్రీంకోర్టు
  • జనవరి 13న రాణా తల్లిదండ్రులతో మాట్లాడనున్న న్యాయస్థానం
  • కోలుకునే అవకాశాల్లేవని తేల్చిన ఎయిమ్స్ వైద్య నివేదిక
  • భారత్‍లో పాసివ్ యూతనేషియాపై మరోసారి చర్చ
13 ఏళ్లుగా జీవచ్ఛవంలా మారిన హరీశ్ రాణాకు కారుణ్య మరణం (పాసివ్ యూతనేషియా) ప్రసాదించే విషయంపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసులో న్యాయపరమైన, నైతికపరమైన ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో.. జనవరి 13న హరీశ్ తల్లిదండ్రుల వాదనలు విన్న తర్వాత కీలక తీర్పు వెలువరించనుంది.

జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఇక దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించింది. హరీశ్‌ను పరీక్షించిన ఢిల్లీ ఎయిమ్స్ సెకండరీ మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయాలని న్యాయవాదులను ఆదేశించింది. "ఆ నివేదిక చాలా బాధాకరం. మాకు ఇదొక పెద్ద సవాలు. కానీ ఆ యువకుడిని ఎప్పటికీ ఇలాగే ఉంచలేం కదా" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జనవరి 13న హరీశ్ తల్లిదండ్రులు, సోదరులతో చాంబర్‌లో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోనుంది.

2013లో చండీగఢ్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో హరీశ్ రాణా నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి స్పృహ లేకుండా జీవచ్ఛవంలా మారిపోయాడు. పీజీఐ చండీగఢ్, ఎయిమ్స్, ఫోర్టిస్ వంటి పలు ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా అతని పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు.

ఇన్నేళ్లుగా కుటుంబ సభ్యులే ఇంట్లో అతడికి సేవలు అందిస్తున్నారు. ఆర్థికంగా, మానసికంగా తీవ్ర భారాన్ని మోస్తున్నారు. కారుణ్య మరణం కోసం వారు గతంలో 2018, 2023లో పిటిషన్లు వేయగా, సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాజాగా హరీశ్ కోలుకునే అవకాశాలు లేవని వైద్య నివేదిక స్పష్టం చేయడంతో మూడోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం పాసివ్ యూతనేషియాకు ప్రాథమిక, ద్వితీయ వైద్య బోర్డులు రెండూ అంగీకరించాల్సి ఉంటుంది. వైద్య నివేదికలు, కుటుంబ సభ్యుల అభీష్టం మేరకే తుది నిర్ణయం ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
Harish Rana
passive euthanasia
Supreme Court
euthanasia India
right to die
AIIMS
medical board
Chandigarh
court hearing
mercy killing

More Telugu News