Rajdhani Express: ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని ఎక్స్‌ప్రెస్.. అస్సాంలో విషాదం

8 Elephants Killed By Rajdhani Express In Assam Train Ops Hit
  • ఈ ఘటనలో 8 ఏనుగులు మృతి.. ఒక ఏనుగు పిల్లకు గాయాలు
  • పట్టాలు తప్పిన రైలు ఇంజన్, ఐదు కోచ్‌లు
  • ప్రయాణికులు సురక్షితం, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
అస్సాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హోజాయ్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున సైరంగ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక ఏనుగు పిల్లను అటవీ అధికారులు రక్షించారు. ప్రమాద తీవ్రతకు రైలు ఇంజన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి.

వివరాల్లోకి వెళితే.. ఇవాళ‌ తెల్లవారుజామున 2:17 గంటల ప్రాంతంలో మిజోరాంలోని సైరంగ్ నుంచి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ఈ ప్రమాదానికి గురైంది. గువాహ‌టికి సుమారు 126 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రమాద వార్త తెలియగానే సహాయక బృందాలు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదం కారణంగా రైలు పట్టాలపై ఏనుగుల కళేబరాలు చెల్లాచెదురుగా పడటంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఎగువ అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే సర్వీసులపై ప్రభావం పడింది. ప్రమాదానికి గురైన రైలులోని ప్రయాణికులను అదే రైలులోని ఖాళీ బెర్తుల్లో సర్దుబాటు చేశారు. గువాహ‌టి చేరుకున్న తర్వాత అదనపు కోచ్‌లు జతచేసి, రైలును తిరిగి ఢిల్లీకి పంపిస్తామని అధికారులు తెలిపారు.

కాగా, ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం ఏనుగుల కారిడార్ కాదని అటవీ అధికారులు తెలిపారు. రైలు పట్టాలపై ఏనుగుల గుంపును గమనించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసినప్పటికీ, ఏనుగులు వేగంగా రైలును ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగిందని తెలిసింది.
Rajdhani Express
Assam train accident
Elephant deaths
Train collision
Hojai district
Guwahati
Northeast India
Train services disrupted
Elephant corridor

More Telugu News