సిరియాలోని ఐసిస్‌ స్థావరాలపై విరుచుకుపడుతున్న అమెరికా బ‌ల‌గాలు

  • సిరియాలో ఐసిస్‌పై అమెరికా భారీ సైనిక చర్య
  • ముగ్గురు అమెరికన్ల మృతికి ప్రతీకారంగా దాడులు
  • ‘ఆపరేషన్ హాకీ స్ట్రైక్’ పేరుతో 70 లక్ష్యాలపై దాడి
  • అమెరికన్లను లక్ష్యంగా చేసుకుంటే వదిలిపెట్టబోమన్న పెంటగాన్
  • ఈ దాడులకు సిరియా తాత్కాలిక ప్రభుత్వం పూర్తి మద్దతు
తమ సైనికులపై దాడికి ప్రతీకారంగా సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులపై అమెరికా భారీ సైనిక చర్య ప్రారంభించింది. ముగ్గురు అమెరికన్ల మృతికి కారణమైన ఐసిస్‌ను ఏరివేసే లక్ష్యంతో ‘ఆపరేషన్ హాకీ స్ట్రైక్’ పేరుతో ఈ దాడులు చేపట్టినట్లు పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సెత్ ప్రకటించారు. అమెరికన్లను లక్ష్యంగా చేసుకున్న ఏ శక్తినీ వదిలిపెట్టబోమని ఆయన తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.

ఈ నెల‌ 13న సిరియాలోని పాల్మైరా నగరంలో అమెరికా దళాలపై ఐసిస్ దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఒక సివిలియన్ వ్యాఖ్యాత మరణించగా, మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఈ క్రూరమైన దాడికి ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు హెగ్సెత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో తెలిపారు. "మిమ్మల్ని వేటాడి, వెంటాడి నిర్దాక్షిణ్యంగా చంపేస్తాం" అని ఆయన ఉగ్రవాదులను హెచ్చరించారు.

ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఐసిస్ బల‌మైన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని, అమెరికన్లపై దాడి చేసే ఉగ్రవాదులను గతంలో కంటే తీవ్రంగా దెబ్బతీస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా తమకు పూర్తి మద్దతు ఇస్తున్నారని ట్రంప్ తెలిపారు. అమెరికా అధికారులు వెల్లడించిన ప్రకారం మధ్య సిరియాలోని సుమారు 70 ఐసిస్ స్థావరాలపై దాడులు జరిగాయి. ఇందులో కమాండ్ సెంటర్లు, ఆయుధ డిపోలు ఉన్నాయి. ఎఫ్-15, ఏ-10, ఎహెచ్-64 అపాచీ హెలికాప్టర్లతో పాటు జోర్డాన్ నుంచి ఎఫ్-16 యుద్ధ విమానాలు, హిమార్స్ రాకెట్ వ్యవస్థలను ఈ ఆపరేషన్‌లో మోహరించారు.

సిరియాలో బషర్ అల్-అసద్ పాలన పతనం తర్వాత అమెరికా-సిరియా సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం 2019లో ఐసిస్ ప్రాబల్యం కోల్పోయినప్పటికీ, సిరియా-ఇరాక్‌లలో ఇప్పటికీ 5,000 నుంచి 7,000 మంది ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ రూపంలో క్రియాశీలంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.


More Telugu News