Boyinapalli Vinod Kumar: గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు.. స్పందించిన బీఆర్ఎస్ మాజీ ఎంపీ

Boyinapalli Vinod Kumar Reacts to MGNREGA Name Change
  • పథకం పేరు మార్పు సరికాదన్న వినోద్ కుమార్
  • రాష్ట్ర ప్రభుత్వానికి 40 శాతం నిధుల నిబంధన శోచనీయమన్న మాజీ ఎంపీ
  • ప్రాథమిక హక్కును మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపణ
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపు అంశంపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పందించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు చేయడం సముచితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 2005లో వచ్చిన ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని, చట్టాన్ని మెరుగుపరుస్తున్నామనే సాకుతో మార్పులు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఈ చట్టం స్థానంలో 'వీబీ జీ రామ్ జీ' తీసుకువచ్చిందని అన్నారు. గతంలో 'నరేగా' పథకం కింద కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులను, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను భరించగా, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరించాలని నిబంధన విధించడం శోచనీయమని ఆయన అన్నారు. పని హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని చేసిన పోరాటాల ఫలితంగా పార్లమెంటులో చట్టం ఆమోదం పొందినప్పుడు తామంతా మద్దతు తెలిపినట్లు గుర్తు చేశారు.

ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ప్రాథమిక హక్కును నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తేనే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందనే నిబంధన అసంబద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు ఆర్థికంగా అంత బలంగా లేవని, ఆ రాష్ట్రాలు 40 శాతం నిధులు ఇవ్వలేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కొత్త విధానం ఆయా రాష్ట్రాల్లో పేదరికాన్ని మరింత పెంచే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా అమలు చేయడం లేదని విమర్శించారు. రానున్న రోజుల్లో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి, రద్దు చేసే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నరేగా పథకం ద్వారా దేశంలో 8.9 కోట్ల మంది ప్రజలు జాబ్ కార్డులు పొంది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారని, ఈ పథకాన్ని రద్దు చేస్తే వీరందరికీ తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Boyinapalli Vinod Kumar
MGNREGA
NREGA
employment guarantee scheme

More Telugu News