దేశవాళీ టోర్నీలో... పంత్ కెప్టెన్సీలో ఆడనున్న కోహ్లీ

  • విజయ్ హజారే ట్రోఫీకి ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా రిషభ్ పంత్
  • జట్టులోకి తిరిగి వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్లు ఇషాంత్ శర్మ
  • బీసీసీఐ నిబంధనల మేరకు దేశవాళీ టోర్నీలో ఆడుతున్న సీనియర్లు
  • డిసెంబర్ 24 నుంచి బెంగళూరు వేదికగా టోర్నీ ప్రారంభం
  • తొలి మ్యాచ్‌లో ఆంధ్రా జట్టుతో ఢిల్లీ తలపడనుంది
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ దేశవాళీ క్రికెట్‌లో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. డిసెంబర్ 24న బెంగళూరులో ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు పంత్ సారథ్యం వహించనున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సీనియర్ పేసర్లు ఇషాంత్ శర్మ, నవదీప్ సైనీ జట్టులోకి తిరిగి రావడంతో ఢిల్లీ మరింత బలోపేతంగా మారింది.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో సమావేశమైన ఢిల్లీ సీనియర్ సెలక్షన్ కమిటీ, తుది జట్టును ఎంపిక చేసింది. ఈ సమావేశంలో సెలక్టర్లు, చీఫ్ కోచ్, డీడీసీఏ కార్యదర్శి పాల్గొన్నారు.

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఢిల్లీ తన తొలి రెండు మ్యాచ్‌లను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆంధ్ర, గుజరాత్ జట్లతో ఆడనుంది. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడే కోహ్లీకి ఇది హోమ్ గ్రౌండ్ కావడం విశేషం. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలవగా, అదే సిరీస్‌లో ఆడే అవకాశం రాని పంత్, ఈ టోర్నీ ద్వారా తిరిగి ఫామ్ అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. దాదాపు 2009/10 సీజన్ తర్వాత కోహ్లీ ఈ టోర్నీలో ఆడనుండటం గమనార్హం.

యువ ఆల్‌రౌండర్ ఆయుష్ బదోనీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభమయ్యే వరకు (జనవరి 11) కోహ్లీ, పంత్ ఢిల్లీ జట్టుకు అందుబాటులో ఉంటారు. 2012/13 సీజన్‌లో ఢిల్లీ ఈ ట్రోఫీని గెలుచుకుంది.


More Telugu News