మంత్రి పదవిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డి
- అదృష్టం ఉంటే త్వరలోనే మంచి పదవి వస్తుందని కోమటిరెడ్డి ధీమా
- పదవి రావడం లేదని గతంలో పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
- తాజా వ్యాఖ్యలతో అధిష్ఠానం నుంచి సంకేతాలు అందాయా అనే చర్చ
చాలాకాలంగా మంత్రి పదవిని ఆశిస్తున్న రాజగోపాల్ రెడ్డి, ఈ విషయంపై పలుమార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో అధిష్ఠానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు అది నెరవేరలేదని గతంలో మీడియా సమావేశాల్లో వ్యాఖ్యానించారు. పార్టీలోని పరిణామాలపై కూడా కొన్ని సందర్భాల్లో ఆయన వివాదాస్పదంగా మాట్లాడారు.
ఎమ్మెల్యేగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని, అదే మంత్రి పదవి లభిస్తే నియోజకవర్గాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే, గతంలో అసహనంతో మాట్లాడిన ఆయన, ఇప్పుడు సానుకూల ధోరణితో మాట్లాడుతుండడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అధిష్ఠానం నుంచి మంత్రి పదవిపై ఆయనకు ఏమైనా సానుకూల సంకేతాలు అందాయా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.