Nara Lokesh: రాజమండ్రిలో మంత్రి నారా లోకేశ్ పర్యటన... నన్నయ వర్సిటీ నూతన భవనాల ప్రారంభం

Nara Lokesh Visits Rajahmundry Inaugurates Nannaya University Buildings
  • రాజమండ్రిలో పర్యటించిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
  • నన్నయ్య వర్సిటీలో రూ.34 కోట్లతో నూతన భవనాల ప్రారంభం
  • ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
  • ఇన్నోవేషన్ హబ్, అంతర్జాతీయ స్టడీస్ సెంటర్లను ప్రారంభించిన మంత్రి
  • ప్రభుత్వం, పూర్వ విద్యార్థులు, సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం రాజమండ్రిలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, చారిత్రక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

నన్నయ్య వర్సిటీలో నూతన భవనాలు

మంత్రి లోకేశ్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీని సందర్శించారు. అక్కడ రూ.34 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మూడు భవనాలను లాంఛనంగా ప్రారంభించారు. యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. ప్రసన్న శ్రీ, ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంజీరా బ్లాక్ పేరుతో నిర్మించిన పరీక్షల భవనం, గౌతమి బ్లాక్ పేరుతో ఏర్పాటు చేసిన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ భవనం, ఇంద్రావతి బ్లాక్‌గా నామకరణం చేసిన స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు.

ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో అభివృద్ధి పనుల పరంపర

నన్నయ్య విశ్వవిద్యాలయం కార్యక్రమానికి ముందు మంత్రి లోకేశ్ రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలను సందర్శించారు. కళాశాలలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. తొలుత కళాశాల ప్రధాన ద్వారం వద్ద నూతన లోగోను ఆవిష్కరించారు. అనంతరం పూర్వ విద్యార్థులు, ప్రభుత్వ సహకారంతో నిర్మించిన స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ బ్లాక్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 'హై-గ్లో ల్యాబ్ ఆన్ వీల్స్' సైన్స్ ప్రాజెక్టును పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. 

వందేమాతరం ఉద్యమంలో కళాశాల పోషించిన చారిత్రక పాత్రకు గుర్తుగా ఏర్పాటు చేసిన 'వందేమాతరం మూవ్‌మెంట్ మెమోరియల్'ను, సైన్స్ బ్లాక్ వద్ద వందేమాతరం పార్కును ఆయన ఆవిష్కరించారు. విదేశీ విద్యార్థుల పరిశోధనల కోసం నిర్మించిన సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ భవనాన్ని ప్రారంభించి, అంతర్జాతీయ విద్యార్థులతో సంభాషించారు. అనంతరం జాతీయ, రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో రాణించిన విద్యార్థులను అభినందించారు.

అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం

ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల అభివృద్ధిలో ప్రభుత్వం, పూర్వ విద్యార్థులు, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యాన్ని మంత్రి లోకేశ్ అభినందించారు. రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (రుడా) నిధులతో రూ.32 లక్షలతో ప్రధాన ద్వారం, పూర్వ విద్యార్థి నున్న తిరుమల రావు, రూసా సహకారంతో రూ.70 లక్షలతో కామర్స్ బ్లాక్, మరో పూర్వ విద్యార్థి డాక్టర్ ఏవీఎస్ రాజు సహకారంతో రూ.11 లక్షలతో అంతర్జాతీయ స్టడీస్ సెంటర్ నిర్మించినట్లు అధికారులు వివరించారు. హన్స సొల్యూషన్స్ సంస్థ సీఎస్ఆర్ నిధుల కింద రూ.1.2 కోట్లతో ఇన్నోవేషన్ హబ్‌ను నిర్మించగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఏఐ-డ్రైవన్ డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కళాశాల విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, జేసీ వై. మేఘా స్వరూప్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రామచంద్రరావు, యూనివర్సిటీ ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Nara Lokesh
Rajamahendravaram
Nannaya University
Government Arts College
Andhra Pradesh Education
Infrastructure Development
Higher Education
Adireddy Srinivas
Somu Veerraju
Education Minister

More Telugu News