బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ యువకుడిని కొట్టి చంపి, దహనం చేసిన అల్లరిమూక

  • బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు
  • దైవదూషణ ఆరోపణలతో హిందూ యువకుడి హత్య
  • మమతా బెనర్జీపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దైవదూషణకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని అల్లరిమూక అత్యంత కిరాతకంగా కొట్టి చంపింది. అనంతరం అతని మృతదేహాన్ని ఓ చెట్టుకు కట్టేసి నిప్పంటించింది. మైమెన్‌సింగ్ జిల్లాలోని భలుకా ప్రాంతంలో జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది.

వివరాల్లోకి వెళితే... భలుకా ప్రాంతంలో నివాసముంటున్న దీపు చంద్ర దాస్ స్థానికంగా ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి మహమ్మద్ ప్రవక్తపై అతడు అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలు వ్యాపించాయి. దీంతో ఎలాంటి విచారణ చేపట్టకుండానే, వందలాది మందితో కూడిన మూక అతడిని చుట్టుముట్టి కర్రలతో దాడి చేసి హతమార్చింది. ఆ తర్వాత మృతదేహానికి నిప్పు పెట్టినట్లు సమాచారం. మృతుడిని దీపు చంద్ర దాస్‌గా భలుకా పోలీసులు ధృవీకరించారు.

ఈ ఘటనపై బీజేపీ పశ్చిమ బెంగాల్ శాఖ తీవ్రంగా స్పందించింది. దీపు చంద్ర దాస్‌ను కొట్టి, ఉరితీసి, సజీవదహనం చేశారని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన హింసతో ఈ ఘటనను పోల్చింది.

బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, "బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ తీవ్రవాదులు దీపు చంద్ర దాస్‌ను కిరాతకంగా చంపేశారు. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అదుపు చేయనప్పుడు, మైనారిటీలకు రక్షణ కరవైనప్పుడు ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఈ ఘటనే నిదర్శనం" అని విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా మమతా బెనర్జీ తన రాజకీయ ప్రయోజనాల కోసం హిందువులను రెండో శ్రేణి పౌరులుగా మార్చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో దేశవ్యాప్తంగా అశాంతి నెలకొంది. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి తర్వాత పలు ప్రాంతాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలోనే మైనారిటీల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిట్టగాంగ్‌లోని భారత డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం వద్ద కూడా నిరసనకారులు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


More Telugu News