Yunus Government: బంగ్లాదేశ్‌లో అల్లర్లు, హింస... స్పందించిన యూనస్ ప్రభుత్వం

Yunus Government Responds to Bangladesh Riots and Violence
  • యువ నాయకుడు హాదీ మృతి నేపథ్యంలో అల్లర్లు, హింస
  • ఆందోళనకారులు సంయమనం పాటించాలని, హింసకు పాల్పడవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి
  • జర్నలిస్టులపై దాడి, మైనార్టీ నేత హత్యను ఖండించిన యూనస్ ప్రభుత్వం
బంగ్లాదేశ్ యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి నేపథ్యంలో దేశంలో అల్లర్లు చెలరేగాయి. దేశ రాజధాని ఢాకాతో పాటు వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనలపై బంగ్లాదేశ్ తాత్కాలిక యూనస్ ప్రభుత్వం స్పందించింది. ఆందోళనకారులు సంయమనం పాటించాలని, హింసకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేసింది.

ఆందోళనల సమయంలో హింసకు పాల్పడటాన్ని, మైనారిటీ నేత హత్యను ప్రభుత్వం ఖండించింది. జర్నలిస్టులపై దాడి సరికాదని పేర్కొంది. ఈ మేరకు జర్నలిస్టులకు యూనస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది.

కాగా, బంగ్లాదేశ్‌లో కొన్నాళ్ల క్రితం కాల్పుల్లో గాయపడిన ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ సింగపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బంగ్లాదేశ్‌లో రాజధాని సహా పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. హాదీ మృతి నేపథ్యంలో ఛత్తోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయాన్ని రాత్రి 11 గంటల సమయంలో ఆందోళనకారులు ముట్టడించారు. భారతదేశానికి, షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో నాటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో హాదీ కీలక పాత్రను పోషించాడు. కొన్నాళ్ల క్రితం భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. గత శుక్రవారం అతడిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.
Yunus Government
Bangladesh Riots
Sharif Usman Hadi
Dhaka Violence
Bangladesh Protests

More Telugu News