నెరవేరిన‌ శపథం.. నాలుగేళ్ల త‌ర్వాత‌ హెయిర్ కట్ చేయించుకున్న బీజేపీ ఎమ్మెల్యే

  • నాలుగేళ్ల తర్వాత హెయిర్ కట్ చేయించుకున్న బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్
  • నియోజకవర్గంలో నీటి సమస్య తీరే వరకు కటింగ్ చేయించుకోనని శపథం
  • 2 కోట్ల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకుల నిర్మాణం ప్రారంభం
  • హామీ నెరవేరడంతో తన ప్రతిజ్ఞను విరమించుకున్న ఎమ్మెల్యే
మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్, దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గురువారం హెయిర్‌ కట్ చేయించుకున్నారు. తన నియోజకవర్గంలోని ప్రజల నీటి కష్టాలు తీరే వరకు జుట్టు కత్తిరించుకోనని ఆయన చేసిన శపథం నెరవేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రామ్ కదమ్ ముంబైలోని ఘట్కోపర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు కొండలు, గుట్టలతో నిండి ఉండటంతో మంచినీటి సరఫరా తీవ్ర సమస్యగా మారింది. ప్రజల ఇబ్బందులను చూసి చలించిన ఆయన, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు కటింగ్ చేయించుకోబోనని నాలుగేళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు.

కొండ ప్రాంతాల్లోని ప్రజల కోసం 2 కోట్ల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకులు నిర్మించాలని, వాటికి భందూప్ నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆయన ప్రయత్నాలు ఫలించి, ప్రభుత్వం వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులను తాజాగా ప్రారంభించింది.

పనులు మొదలవడంతో ఆయన తన శపథాన్ని విరమించుకున్నారు. ఈ సందర్భంగా రామ్ కదమ్ మాట్లాడుతూ.. "ఐదేళ్ల క్రితమే ఈ సమస్య పరిష్కారం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఇప్పుడు 2 కోట్ల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకుల నిర్మాణం, భందూప్ నుంచి పైప్‌లైన్ పనులు మొదలవడం సంతోషంగా ఉంది" అని తెలిపారు.


More Telugu News