కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ ప్రాజెక్టులపై కీలక చర్చ

  • కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ
  • పోలవరం సహా పలు ప్రాజెక్టులకు నిధులు, అనుమతులపై చర్చ
  • జల్ జీవన్ మిషన్‌కు అదనంగా రూ.1000 కోట్లు కేటాయించాలని వినతి
  • వంశధార, ఆల్మట్టి వివాదాల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞ‌ప్తి
ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతుల సాధనే లక్ష్యంగా ఈరోజు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టుతో పాటు జల్ జీవన్ మిషన్, ఇతర పథకాలకు నిధుల విడుదల, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.

రాష్ట్ర విభజన హామీలలో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరారు. ఏపీకి నీటి భద్రత చాలా కీలకమని, ఈ దిశగా కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జల్ జీవన్ మిషన్ అమలు కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని, రాష్ట్ర వాటాగా ఇప్పటికే ఖర్చు చేసిన రూ.524.41 కోట్లకు సంబంధించిన కేంద్ర వాటాను విడుదల చేయాలని కోరారు. అలాగే పీఎం కృషి సించాయి యోజన (PMKSY) కింద చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.

పోలవరం జాతీయ ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర మంత్రికి వివరించిన సీఎం, పెండింగ్‌లో ఉన్న అనుమతులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. రెండో దశ పనులకు అవసరమైన నిధులపై త్వరలోనే సమగ్ర నివేదిక సమర్పిస్తామని తెలిపారు. వంశధార ట్రైబ్యునల్ తీర్పును అమలు చేసి, శ్రీకాకుళం జిల్లా కరవు ప్రాంతాలకు ఉపయోగపడే నేరడి బ్యారేజీ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.

అలాగే సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు అంశంలో కర్ణాటక ముందుకు వెళ్లకుండా కేంద్రం నిలువరించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే ఈ చర్యను అడ్డుకోవాలని ఆయన స్పష్టం చేశారు.



More Telugu News