Bangladesh Protests: భగ్గుమన్న బంగ్లాదేశ్.. మీడియా ఆఫీసులకు నిప్పు.. ప్రాణభయంతో వణికిపోయిన జర్నలిస్టులు.. రంగంలోకి ఆర్మీ

Bangladesh Protests Media Offices Attacked Journalists Fear for Lives
  • యువనేత మృతితో బంగ్లాదేశ్‌లో చెలరేగిన నిరసనలు
  • రెండు ప్రధాన వార్తాపత్రికల కార్యాలయాలకు ఆందోళనకారుల నిప్పు
  • కార్యాలయంలో గంటలపాటు చిక్కుకున్న 25 మంది జర్నలిస్టులు
  • రంగంలోకి దిగి జర్నలిస్టులను కాపాడిన బంగ్లాదేశ్‌ సైన్యం
  • ఎడిటర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌పై కూడా మూకదాడి
బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యువజన నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హది (32) మృతితో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రాజధాని ఢాకాలో వందలాది మంది ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారు. దేశంలోని రెండు ప్రముఖ వార్తాపత్రికలైన 'ప్రథమ్ ఆలో', 'ది డైలీ స్టార్' కార్యాలయాలపై దాడి చేసి నిప్పంటించారు.

నిన్న అర్ధరాత్రి సమయంలో మొదట 'ప్రథమ్ ఆలో' కార్యాలయాన్ని చుట్టుముట్టిన నిరసనకారులు, నినాదాలు చేస్తూ భవనాన్ని ధ్వంసం చేసి, ఆ తర్వాత నిప్పు పెట్టారు. అనంతరం అక్కడి నుంచి 'ది డైలీ స్టార్' కార్యాలయానికి చేరుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడితో ఆఫీసులోని జర్నలిస్టులు భవనం లోపలే చిక్కుకుపోయారు. దాదాపు 25 మంది జర్నలిస్టులు ప్రాణభయంతో టెర్రస్‌పైకి పరుగులు తీశారు.

"నాకు ఊపిరాడటం లేదు. అంతా పొగమయంగా ఉంది. నన్ను చంపేస్తున్నారు" అంటూ 'ది డైలీ స్టార్' రిపోర్టర్ జైమా ఇస్లాం ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ పరిస్థితి తీవ్రతను తెలియజేసింది.

సమాచారం అందుకున్న బంగ్లాదేశ్ ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి భవనంలో చిక్కుకున్న 25 మంది జర్నలిస్టులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎడిటర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నూరుల్ కబీర్‌పై కూడా ఆందోళనకారులు దాడి చేసి కొట్టారు. ప్రస్తుతం 'ది డైలీ స్టార్' కార్యాలయం వద్ద సైన్యాన్ని మోహరించారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వానికి పరోక్ష మద్దతు ఇస్తున్న ఈ రెండు పత్రికలనే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనే దానిపై స్పష్టత రాలేదు.
Bangladesh Protests
Sharif Usman Hadi
Pratham Alo
The Daily Star
Dhaka News
Bangladesh Army
Journalist Attack
Media Violence
Political unrest
Nurul Kabir

More Telugu News