T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ కోసం రేపే భారత జట్టు ప్రకటన.. పలు స్థానాలపై ఉత్కంఠ

T20 World Cup India Squad Announcement Tomorrow
  • సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్ ఫామ్‌పై నెలకొన్న ఆందోళన
  • వికెట్ కీపర్ల స్థానం కోసం తీవ్రమైన పోటీ
  • రింకూ సింగ్, యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కేనా?
  • ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న మెగా టోర్నీ
టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం భారత జట్టు ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు రేపు తెరపడనుంది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించి, మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. దక్షిణాఫ్రికాతో ఈరోజు జ‌రిగే ఆఖరి టీ20 మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే ఈ ప్రకటన రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈసారి జట్టు ఎంపిక సెలక్టర్లకు పెను సవాల్‌గా మారింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. దీంతో వీరిద్దరి విషయంలో సెలక్టర్లు ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు అద్భుతమైన రికార్డు ఉన్న యశస్వి జైస్వాల్‌కు మళ్లీ అవకాశం దక్కుతుందా? లేదా? అన్నది చూడాలి.

వికెట్ కీపర్ల స్థానంపై కూడా తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఆసియా కప్ నుంచి సంజూ శాంసన్, జితేష్ శర్మలను కొనసాగిస్తున్నప్పటికీ, జితేశ్‌ ఒక్క ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడలేదు. సంజూ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసి చివరకు తుది జట్టు నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ వంటి వారు తిరిగి రేసులోకి వచ్చే అవకాశం ఉంది.

గత కొంతకాలంగా జట్టులో రెగ్యులర్‌గా ఉన్న రింకూ సింగ్‌ను దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేయలేదు. దీంతో అతడు వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌కు దూరమవుతాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని శ్రేయస్ అయ్యర్ ఎంపిక కూడా ప్రశ్నార్థకమే.

ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. టోర్నీకి ముందు భారత్, న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

భారత జట్టు (అంచనా):
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్ స్టేజ్ షెడ్యూల్:
భార‌త్‌ vs యుఎస్ఎ ఫిబ్రవరి 7న (ముంబైలోని వాంఖడే స్టేడియంలో)
భార‌త్‌ vs నమీబియా ఫిబ్రవరి 12న (ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో)
భార‌త్‌ vs పాకిస్థాన్ ఫిబ్రవరి 15న  (కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో)
భార‌త్‌ vs నెద‌ర్లాండ్స్ ఫిబ్రవరి 18న  (అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో)


ఇండియా vs న్యూజిలాండ్ టీ20 సిరీస్‌ షెడ్యూల్ 
1వ టీ20: నాగ్‌పూర్, 2026 జనవరి 21న
2వ టీ20: రాయ్‌పూర్, జనవరి 23న‌
3వ టీ20: గువ‌హ‌టి, జనవరి 25న‌
4వ టీ20: వైజాగ్, జనవరి 28న‌
5వ టీ20: త్రివేండ్రం, జనవరి 31న‌
T20 World Cup 2026
Suryakumar Yadav
Indian Cricket Team
Ajit Agarkar
Shubman Gill
Yashasvi Jaiswal
Sanju Samson
Rishabh Pant
India vs Pakistan
T20 Series

More Telugu News