Chandrababu: సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్' అవార్డు.. కలెక్టర్ల సదస్సులో స్టాండింగ్ ఓవేషన్

Chandrababu Wins Business Reformer Award Standing Ovation at Collectors Meeting
  • సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ 'బిజినెస్ రిఫార్మర్' అవార్డు
  • కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రికి స్టాండింగ్ ఓవేషన్‌తో అభినందనలు
  • ఇది దాదాగిరి కాదు, నాయుడుగిరి పాలన అంటూ మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్య
  • ఈ ఘనత అధికారులదేనన్న సీఎం చంద్రబాబు
  • స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టి సారించామని వెల్లడి
సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు లభించింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'ఎకనామిక్ టైమ్స్' ఈ అవార్డును ప్రకటించిన విషయాన్ని కలెక్టర్ల సదస్సులో మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడగానే సదస్సులోని మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు తమ స్థానాల్లోంచి లేచి నిలబడి (స్టాండింగ్ ఓవేషన్) ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ఈ అవార్డు రావడం గర్వకారణమని అన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... ఈ అవార్డు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని, 'ఎకనామిక్ టైమ్స్' హెడ్డింగ్ చూస్తేనే గూస్‌బంప్స్ వస్తున్నాయని వ్యాఖ్యానించారు. "గతంలో రాష్ట్రం దాదాగిరిని చూసింది, ఇప్పుడు అభివృద్ధి వైపు పరుగులు పెట్టే నాయుడుగిరిని చూస్తోంది" అని అన్నారు. ఇప్పటివరకు కేంద్రంలో ఉన్నవారికే ఈ పురస్కారం దక్కిందని, తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి లభించడం ఇదే ప్రథమమని వివరించారు.

అనంతరం సీఎం చంద్రబాబు స్పందిస్తూ... ఈ ఘనత తనది కాదని, తన సహచరులు, అధికారులు, కలెక్టర్లదేనని అన్నారు. తాను సాధారణంగా అవార్డులు స్వీకరించనని, గతంలో విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్లు ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించానని గుర్తుచేశారు. "గత ప్రభుత్వంలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం. ఇప్పుడు గేర్ మార్చి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానంతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. 18 నెలల్లో 25 కొత్త పాలసీలు తెచ్చాం" అని తెలిపారు. 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం దేశంలోనే తొలిసారిగా ఎస్క్రో ఖాతాను తీసుకొస్తున్నామని, పాలనలో కూడా 'స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్' అమలు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.
Chandrababu
Business Reformer Award
Andhra Pradesh
Economic Times
Acham Naidu
Payyavula Keshav
Pawan Kalyan
Investments
AP Collectors Meeting

More Telugu News