'వంతారా'లో మెస్సీ.. 'హర్ హర్ మహాదేవ్' అంటూ పూజలు.. ఇదిగో వీడియో!

  • అనంత్ అంబానీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో మెస్సీ పర్యటన
  • హిందూ సంప్రదాయంలో 'హర్ హర్ మహాదేవ్' అంటూ పూజలు
  • గుజరాత్‌లోని 'వంతారా' సందర్శనతో పర్యటనకు ప్రశాంత ముగింపు
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన మంగళవారంతో ముగిసింది. 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025'లో భాగంగా చివరి రోజు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో పర్యటించాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణి సంరక్షణ, పునరావాస కేంద్రం 'వంతారా'ను ఆయన సందర్శించాడు. ఈ సందర్భంగా మెస్సీ హిందూ సంప్రదాయంలో పూజలు నిర్వహించడం అందరి దృష్టిని ఆకర్షించింది. 'హర్ హర్ మహాదేవ్' అంటూ ప్రార్థనలు చేస్తున్న వీడియో నెట్టింట‌ వైరల్ అయింది. మెస్సీతో పాటు ఆయన సహచర ఆటగాళ్లు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మూడు రోజుల పాటు సాగిన మెస్సీ పర్యటన మిశ్రమ అనుభవాలతో ముగిసింది. శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో పర్యటన రసాభాసగా ప్రారంభమైంది. మెస్సీని కేవలం 20 నిమిషాల పాటు చూసే అవకాశం కూడా అభిమానులకు దక్కలేదు. దీంతో ఆగ్రహానికి గురైన అభిమానులు స్టేడియంలో కుర్చీలు, బాటిళ్లు విసురుతూ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో కార్యక్రమ నిర్వాహకుడు శతద్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే, ఆ తర్వాత హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో పర్యటనలు విజయవంతంగా సాగాయి. హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని మెస్సీ కలిశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా 10వ నంబర్ జెర్సీని అందుకున్నాడు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐసీసీ ఛైర్మన్ జై షా.. మెస్సీకి టీ20 వరల్డ్ కప్ 2026 టికెట్లను బహూకరించాడు. కోల్‌కతాలో గందరగోళంతో మొదలైన ఈ పర్యటన, చివరకు గుజరాత్‌లో ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా ముగిసింది.


More Telugu News