హోంమంత్రి అనితకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేశ్

  • యువగళం పాదయాత్ర హామీని నిలబెట్టుకున్నామన్న లోకేశ్
  • కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను యజ్ఞంలా పూర్తి చేశారని అనితకు ప్రశంస
  • పోస్టుల భర్తీని అడ్డుకునే కుట్రలను అనిత సమర్థంగా ఎదుర్కొన్నారని కితాబు
  • హోంమంత్రితో పాటు అధికార యంత్రాంగానికి లోకేశ్ ధన్యవాదాలు
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. తాను యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 6,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను హోంమంత్రి ఆధ్వర్యంలో విజయవంతంగా పూర్తి చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియను ఒక యజ్ఞంలా పూర్తి చేశారంటూ మంత్రి అనితకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

"యువగళం పాదయాత్రలో కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చాను. కానిస్టేబుల్ పోస్టుల భర్తీని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నా హామీని నెరవేర్చేందుకు కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియను ఒక యజ్ఞంలా చేపట్టి పూర్తి చేసిన గౌరవ హోం మంత్రి వంగలపూడి అనిత గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పోస్టుల భర్తీని అడ్డుకునేందుకు వేసిన కుట్రపూరిత కేసులను అత్యంత చాకచక్యంగా పరిష్కరించడం వెనుక అధికార యంత్రాంగానికి హోంమంత్రి గారు పూర్తి సహాయ, సహకారాలు అందించారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన హోం మంత్రి గారికి, అధికార, పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. 



More Telugu News