స్వయంగా కారు నడిపి మోదీని ఎయిర్ పోర్టు నుంచి హోటల్ కు తీసుకొచ్చిన ఇథియోపియా ప్రధాని

  • మోదీకి కారు డ్రైవర్‌గా మారిన ఇథియోపియా ప్రధాని
  • ఇరు దేశాల చారిత్రక బంధాన్ని గుర్తుచేసిన ప్రధాని మోదీ
  • 'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని
  • మోదీకి ఇథియోపియా అత్యున్నత పౌర పురస్కారం
ప్రధాని నరేంద్ర మోదీ తన ఇథియోపియా పర్యటనలో భాగంగా ఈరోజు ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. భారత్, ఇథియోపియా మధ్య వాతావరణంలోనే కాకుండా స్ఫూర్తిలోనూ సారూప్యత ఉందని అన్నారు. ఈ పర్యటన సందర్భంగా మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ స్వయంగా కారు నడుపుతూ విమానాశ్రయం నుంచి హోటల్ వరకు మోదీని తీసుకువచ్చారు.

పార్లమెంటులో మోదీ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య రెండు వేల ఏళ్ల నాటి చారిత్రక, వాణిజ్య సంబంధాలను గుర్తుచేశారు. ఆధునిక కాలంలో ఇథియోపియా విముక్తి కోసం భారత సైనికులు కూడా పోరాడారని తెలిపారు. ముఖ్యంగా వేలాది మంది భారతీయ ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దారని, వారు ఇథియోపియా ప్రజల హృదయాలను గెలుచుకున్నారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో భారత్ 150కి పైగా దేశాలకు మందులు, వ్యాక్సిన్లు పంపిందని, అందులో భాగంగా ఇథియోపియాకు 4 మిలియన్లకు పైగా డోసులు అందించడం గర్వకారణమని అన్నారు.

అంతకుముందు 'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమంలో భాగంగా ఇథియోపియా ప్రధానితో కలిసి మోదీ అడిస్ అబాబాలో ఒక మొక్కను నాటారు. అనంతరం చారిత్రక అద్వా యుద్ధ విజయ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. ఈ స్మారకం 1896లో ఇటలీ ఆక్రమణదారులపై ఇథియోపియా సైన్యాలు సాధించిన చారిత్రక విజయానికి ప్రతీక.

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పౌర పురస్కారం 'గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా'ను ప్రదానం చేశారు. ఈ గౌరవానికి ఆయన ఇథియోపియా ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నిన్న‌ అడిస్ అబాబా చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.



More Telugu News