‘అవతార్ 3’ చూసిన రాజమౌళి... కామెరూన్‌తో ఆసక్తికర సంభాషణ

  • వారణాసి సెట్‌కు వస్తానన్న జేమ్స్‌ కామెరూన్‌
  • ఇండస్ట్రీ థ్రిల్ అవుతుందన్న రాజమౌళి
  • సరదాగా కెమెరా పట్టుకుని కొన్ని సీన్లు తీస్తానన్న కామెరూన్
ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ చూడాలని ఉందని, సెట్‌కు రావొచ్చా అని కామెరూన్ అడగటం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఊహించని మాటకు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు.

విజువల్ వండర్‌గా పేరుగాంచిన ‘అవతార్’ ఫ్రాంచైజీలో మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం భారత్‌లో ప్రత్యేక ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాజమౌళి సహా కొంతమంది సినీ ప్రముఖులకు ‘అవతార్ 3’ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతరం జేమ్స్ కామెరూన్, రాజమౌళి వీడియో కాల్ ద్వారా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది.

సినిమా చూసిన అనుభూతిని పంచుకుంటూ, "అవతార్ 3 చూస్తున్నంత సేపు ఓ చిన్న పిల్లాడిలా మారిపోయాను. విజువల్స్, పాత్రల రూపకల్పన అద్భుతం. ఈ ఫ్రాంచైజీ వెండితెరకు ఒక బెంచ్‌మార్క్" అని రాజమౌళి ప్రశంసించారు.

ఈ సందర్భంగా ‘వారణాసి’ సినిమా పురోగతి గురించి కామెరూన్ ఆరా తీశారు. ఇంకా ఏడెనిమిది నెలల షూటింగ్ మిగిలి ఉందని రాజమౌళి చెప్పగా, "నేను మీ సెట్‌కు వచ్చి షూటింగ్ చూడవచ్చా?" అని కామెరూన్ అడిగారు. దీనికి రాజమౌళి బదులిస్తూ, "మీరు రావడం మాకు ఎంతో సంతోషం. మా టీమ్ మాత్రమే కాదు, మొత్తం భారత సినీ పరిశ్రమ థ్రిల్ అవుతుంది" అని అన్నారు. "పులులతో ఏమైనా సన్నివేశాలు తీస్తుంటే చెప్పు, నేనే కెమెరా పట్టుకుని కొన్ని షాట్స్ తీస్తా" అని కామెరూన్ సరదాగా వ్యాఖ్యానించడంతో ఇద్దరి మధ్య నవ్వులు విరిశాయి.


More Telugu News