ఐపీఎల్‌లో కశ్మీర్ యువకుడికి జాక్‌పాట్.. బారాముల్లాలో సంబరాలు.. ఇదిగో వీడియో!

  • ఐపీఎల్ వేలంలో కశ్మీర్ క్రికెటర్ ఆకిబ్ దార్‌కు జాక్‌పాట్
  • రూ. 8.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
  • ఆకిబ్ స్వస్థలం బారాముల్లాలో మిన్నంటిన సంబరాలు
  • ఇది తన కుమారుడి కష్టానికి దక్కిన ఫలితమన్న తండ్రి
జమ్మూకశ్మీర్‌కు చెందిన యువ క్రికెటర్ ఆకిబ్ దార్ ఐపీఎల్ వేలంలో సంచలనం సృష్టించాడు. మంగళవారం జరిగిన వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.8.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ వార్త తెలియగానే ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా షీరీ పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది.

ఆకిబ్ దార్‌కు ఐపీఎల్‌లో చోటు దక్కిందని తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. సంప్రదాయ డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. కుటుంబ సభ్యులు స్వీట్లు పంచి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇదంతా దేవుడి దయ, ఆకిబ్ ఏళ్ల తరబడి పడిన కష్టానికి దక్కిన ఫలితమని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆకిబ్ తండ్రి, పాఠశాల ఉపాధ్యాయుడైన గులాం నబీ సంతోషం వ్యక్తం చేశారు. "ఈ రోజును చూసేందుకు నేను బతికి ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు. నా కుమారుడి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను" అని ఆయన అన్నారు. యువత చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.

ఆకిబ్ బంధువు సజాద్-ఉల్-బషీర్ మాట్లాడుతూ.. "ఇది మా అందరికీ ఎంతో సంతోషకరమైన క్షణం. ఆకిబ్ ఎప్పుడూ కష్టపడి పనిచేసేవాడు. క్రీడల వల్ల షీరీ ప్రాంతానికి మంచి గుర్తింపు వచ్చింది" అని తెలిపారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, రంజీ ట్రోఫీల్లో నిలకడగా రాణించడం వల్లే ఆకిబ్‌కు ఈ అవకాశం దక్కింది.


More Telugu News