మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్.. 500 మందికి క్యాన్సర్‌ చికిత్స

  • రొమ్ము క్యాన్సర్ బాధితులకు కొత్త జీవితం అందించినట్లు వెల్లడి
  • 500 కుటుంబాల్లో ఆనందం నింపడం సంతోషంగా ఉందన్న రియల్ హీరో
  • సమష్టి కృషితోనే ఇలాంటి పనులు చేయగలమని వ్యాఖ్య
బాలీవుడ్ నటుడు, రియల్ హీరోగా పేరొందిన సోనూ సూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న 500 మంది మహిళలకు చికిత్స చేయించారు. తన ఫౌండేషన్ ద్వారా ఈ చికిత్సలకు అయిన ఖర్చును భరించామని సోనూ సూద్ తెలిపారు. ఇది ప్రారంభమేనని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని వివరించారు. మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ పై అవగాహన కల్పించడంపైన మరింత దృష్టిసారించినట్లు సోనూ సూద్ పేర్కొన్నారు.

‘రొమ్ము క్యాన్సర్ బాధిత మహిళలు 500 మందిని మేం కాపాడగలిగాం. శస్త్రచికిత్సతో వారందరికీ కొత్త జీవితం లభించింది. 500 కుటుంబాలలో ఆనందం నింపినందుకు సంతోషంగా ఉంది. సమష్టి కృషితోనే ఇలాంటి గొప్ప పనులు జరుగుతాయి’ అని సోనూసూద్‌ తెలిపారు. 

కాగా, కరోనా సమయంలోనూ సోనూ సూద్ పలు దాతృత్వ కార్యక్రమాలు చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కాలంలో వలస కూలీలను సొంత ఖర్చులతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మరీ స్వస్థలాలకు పంపించి ఆయన రియల్ హీరో అనిపించుకున్నారు.


More Telugu News