ఐపీఎల్ వేలంలో రూ. 25 కోట్ల‌ జాక్‌పాట్.. మరుసటి రోజే డకౌట్!

  • ఐపీఎల్ వేలంలో రూ. 25.2 కోట్లు పలికిన కామెరాన్ గ్రీన్
  • ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో డకౌట్
  • జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన గ్రీన్
ఐపీఎల్-2026 వేలంలో రికార్డు స్థాయిలో రూ. 25.2 కోట్లు పలికిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌కు మరుసటి రోజే మైదానంలో చుక్కెదురైంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో యాషెస్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఇవాళ‌ అడిలైడ్ ఓవల్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టు తొలి రోజు ఆటలో ఇలా గ్రీన్ నిరాశ‌ప‌రిచాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్‌తో ఉక్కిరిబిక్కిరైన గ్రీన్, ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. ఆర్చర్ విసిరిన బంతిని ఆడేందుకు ప్రయత్నించగా, బ్రైడన్ కార్స్ క్యాచ్ పట్టడంతో సున్నా పరుగులకే అత‌ని ఇన్నింగ్స్ ముగిసింది.

ఇక‌, మంగళవారం అబుదాబిలో జరిగిన ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కామెరాన్ గ్రీన్‌ను రూ. 25.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, వేలంలో తన పేరును మేనేజర్ పొరపాటున బ్యాటర్ల జాబితాలో చేర్చారని, కానీ తాను ఐపీఎల్‌లో తప్పకుండా బౌలింగ్ చేస్తానని గ్రీన్ గతవారమే స్పష్టం చేశాడు. వేలంలో భారీ మొత్తం దక్కించుకున్నా, ఆ తర్వాతి రోజే కీలకమైన యాషెస్ మ్యాచ్‌లో తను విఫలం కావడం చర్చనీయాంశంగా మారింది.


More Telugu News