టైమ్స్ మ్యాగజైన్ పై ఏంజెలినా జోలీ సంచలన ఫొటో.. శస్త్ర చికిత్స చిహ్నాలను బహిర్గతం చేసిన నటి

  • రొమ్ము క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్న మహిళలకు ధైర్యం ఇచ్చేందుకేనని వెల్లడి
  • క్యాన్సర్ ముప్పు తప్పించుకోవడానికి ముందస్తు చికిత్స చేసుకున్న జోలీ
  • ఆ ఆపరేషన్ కోసం తన శరీరంపై పెట్టిన గాట్లను బయటపెట్టిన నటి
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ తాజాగా మరో సంచలన ఫొటో షూట్ చేశారు. టైమ్స్ మ్యాగజైన్ ఫ్రాన్స్ కవర్ పేజీ కోసం తాను తీసుకున్న రొమ్ము క్యాన్సర్ ముందస్తు చికిత్స గాయాలను బహిర్గతం చేశారు. క్యాన్సర్ ముప్పు నేపథ్యంలో ‘మాస్టెక్టమీ’ ద్వారా ఏంజెలినా జోలీ తన రెండు రొమ్ములను తొలగించుకున్నారు. ఈ ఆపరేషన్ సందర్భంగా తన ఛాతీపై అయిన గాట్లను (స్కార్స్) తొలిసారి ప్రపంచానికి చూపించారు. తోటి మహిళలకు ధైర్యం ఇచ్చేందుకే ఈ పని చేసినట్లు నటి వెల్లడించారు.

ఏంజెలినా జోలీ తల్లి, నటి మార్షెలిన్ బెర్ట్రాండ్ రొమ్ము క్యాన్సర్ బారిన పడి 56 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా తనకూ వచ్చే అవకాశం ఉందని తెలియడంతో ఏంజెలినా జోలీ ముందస్తు చికిత్స తీసుకున్నారు. సుదీర్ఘ సంఘర్షణ తర్వాత మాస్టెక్టమీ ద్వారా రొమ్ములను తొలగించుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి, ఆపరేషన్ తర్వాత తాను మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు జోలీ తెలిపారు. ఇప్పటికీ చాలామంది మహిళలు తమకు బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు ఉందని తెలిసినా మాస్టెక్టమీకి సిద్ధపడరని చెప్పారు. వారికి ధైర్యం కల్పించేందుకు, ఆపరేషన్ కోసం వారు ముందుకు వచ్చేలా చేయడానికి తాను ఈ ఫొటోషూట్ కు అంగీకరించానని జోలీ వివరించారు.


More Telugu News