చెన్నై నా ఇల్లు.. ధోనీ భాయ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటా: మతీశ పతిరణ‌ భావోద్వేగ పోస్ట్

  • ఐపీఎల్ వేలంలో కేకేఆర్ జట్టుకు వెళ్లిన మతీశ పతిరణ‌
  • సీఎస్‌కే, అభిమానులకు భావోద్వేగ వీడ్కోలు సందేశం
  • తనపై నమ్మకం ఉంచిన ధోనీకి ప్రత్యేక కృతజ్ఞతలు
  • 50 వికెట్ల మైలురాయి అందుకోలేకపోయానని ఆవేదన
  • కేకేఆర్‌తో కొత్త ప్ర‌యాణం ప్రారంభిస్తున్నట్లు వెల్లడి
శ్రీలంక యువ పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మాజీ స్టార్ బౌలర్ మతీశ పతిరణ‌ తన పాత ఫ్రాంచైజీకి భావోద్వేగ వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అతడిని రూ. 18 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎస్‌కే యాజమాన్యానికి, అభిమానులకు, ముఖ్యంగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు.

గత కొన్ని సీజన్లుగా సీఎస్‌కే బౌలింగ్‌కు వెన్నెముకగా నిలిచిన పతిరణ‌, 2023లో జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, గత సీజన్‌లో ఫామ్ కోల్పోవడం, గాయాల బారిన పడటంతో సీఎస్‌కే అతడిని వేలానికి విడుదల చేసింది. వేలంలో ఢిల్లీ, లక్నో తీవ్రంగా పోటీపడినా చివరకు కేకేఆర్ భారీ ధరకు దక్కించుకుంది. సీఎస్‌కే తరఫున నాలుగు సీజన్లలో 32 మ్యాచ్‌లు ఆడిన పతిరణ‌, మొత్తం 47 వికెట్లు పడగొట్టాడు.

ఈ సందర్భంగా తన పోస్టులో "సీఎస్‌కే నాకు క్రికెట్ కంటే ఎక్కువే ఇచ్చింది. నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఓ కుటుంబాన్ని అందించింది. నా చివరి సీజన్‌ను ఘనంగా ముగించి, ఫ్రాంచైజీ తరఫున 50 వికెట్ల మైలురాయిని అందుకోవాలని చాలా ఆశపడ్డాను. కానీ, దురదృష్టవశాత్తు అది జరగలేదు" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

"నాపై నమ్మకం ఉంచిన ధోనీ భాయ్‌కు, కాశీ సర్‌కు, యాజమాన్యానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. చెన్నై నా ఇల్లు లాంటిది. నా సోదరుల్లాంటి సహచరులకు, కష్టసుఖాల్లో నాకు అండగా నిలిచిన అభిమానులకు నా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. చెన్నైకి నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. గౌరవంతో, కృతజ్ఞతతో ఈ ప్రయాణాన్ని ముగించి.. కేకేఆర్‌తో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను" అని పతిరణ‌ తన పోస్టులో రాసుకొచ్చాడు.


More Telugu News