ఏపీ రవాణా రంగంపై రెసర్జెంట్ ఇండియా దృష్టి.. మంత్రికి కీలక ప్రతిపాదనలు
- మంత్రి రాంప్రసాద్ రెడ్డితో రెసర్జెంట్ ఇండియా ప్రతినిధుల భేటీ
- ఏపీలో ఈవీ మొబిలిటీ నెట్‌వర్క్‌పై ప్రతిపాదనలు
- ప్రధాన బస్ టెర్మినల్స్ ఆధునికీకరణకు ప్రణాళిక
- పీపీపీ పద్ధతిలో పనిచేసేందుకు సిద్ధమని తెలిపిన సంస్థ
ఆంధ్రప్రదేశ్ రవాణా రంగం అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు రెసర్జెంట్ ఇండియా లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తమ ప్రతిపాదనలను సమర్పించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మొబిలిటీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, ప్రధాన బస్ టెర్మినల్స్‌ను ఆధునికీకరించడంపై వారు మంత్రికి వివరించారు.
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌తో పాటు విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు బస్ టెర్మినల్స్‌ను ఆధునికీకరించేందుకు గల అవకాశాలను ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన పూర్తి ఆర్థిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్, గ్రీన్ బాండ్లు, స్ట్రక్చర్డ్ ఫైనాన్సింగ్ వంటి మార్గాల ద్వారా నిధులు సమీకరిస్తామని పేర్కొన్నారు.
ఈవీ మొబిలిటీ నెట్‌వర్క్‌తో పాటు ఆధునిక బస్ టెర్మినల్స్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో సమగ్ర రవాణా వ్యవస్థను నిర్మించవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టులలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.