ఇథియోపియా అత్యున్నత పురస్కారం అందుకున్న తొలి ప్రపంచ నేతగా మోదీ

  • ప్రధాని మోదీకి 'ది గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా' పురస్కారం
  • అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు అంకితమిస్తున్నట్టు మోదీ వెల్లడి
  • వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి భారత్-ఇథియోపియా సంబంధాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. ఆఫ్రికా దేశమైన ఇథియోపియా అత్యున్నత పౌర పురస్కారం 'ది గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా'ను ఆయనకు ప్రదానం చేసింది. మంగళవారం అడ్డిస్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇథియోపియా ప్రధాని అబే అహ్మద్ అలీ చేతుల మీదుగా మోదీ ఈ అవార్డును అందుకున్నారు.

భారత్-ఇథియోపియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన చేసిన విశేష కృషికి, ప్రపంచ నేతగా ఆయన దార్శనిక నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్న తొలి ప్రపంచ దేశాధినేత లేదా ప్రభుత్వాధినేత ప్రధాని మోదీ కావడం విశేషం.

ఈ గౌరవాన్ని తాను 140 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. "ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటైన ఇథియోపియా నుంచి ఈ పురస్కారం అందుకోవడం గర్వంగా ఉంది. ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారత ప్రజలకు అంకితం చేస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. స్నేహితుడు, సోదరుడు అయిన ప్రధాని అబే అహ్మద్ ఆహ్వానం మేరకు తాను ఇథియోపియా పర్యటనకు వచ్చానని మోదీ గుర్తు చేసుకున్నారు.

   
ఈ పర్యటన సందర్భంగా భారత్-ఇథియోపియా ద్వైపాక్షిక సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచుతున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. వందేళ్లకు పైగా భారతీయ ఉపాధ్యాయులు ఇథియోపియా అభివృద్ధిలో భాగమయ్యారని, ఇరు దేశాల మధ్య బలమైన బంధానికి విద్య పునాది వేసిందని మోదీ అన్నారు. కాగా, ప్రధాని మోదీకి లభించిన 28వ అత్యున్నత విదేశీ పురస్కారం ఇది.


More Telugu News