15 గంటల పని.. రూ.763 సంపాదన.. గిగ్ వర్కర్ల దోపిడీపై ఎంపీ రాఘవ్ చద్దా ఫైర్

  • బ్లింకిట్ ఏజెంట్ వీడియో వైరల్
  • ఇది యాప్‌ల చాటున జరుగుతున్న దోపిడీ అంటూ ఎంపీ రాఘవ్ చద్దా ఆగ్రహం
  • గిగ్ వర్కర్లకు సరైన వేతనాలు, పనిగంటలు కల్పించాలని డిమాండ్
  • తక్కువ జీతాలు, అధిక పనితో డిజిటల్ ఎకానమీ నిర్మించలేరని వ్యాఖ్య
క్విక్ కామర్స్ కంపెనీలు గిగ్ వర్కర్ల శ్రమను దోచుకుంటున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ 15 గంటల పాటు 28 డెలివరీలు చేస్తే కేవలం రూ.763 మాత్రమే సంపాదించానని చెబుతున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తక్కువ వేతనాలు, అధిక పని గంటలతో కార్మికులను పీడిస్తూ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తరాఖండ్‌కు చెందిన థప్లియాల్ జీ అనే బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ తన రోజువారీ సంపాదన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. 15 గంటలకు పైగా పనిచేస్తే అతడికి రూ.763 మాత్రమే వచ్చాయి. అంటే గంటకు సగటున రూ.51.33 మాత్రమే. ఈ ఘటనపై స్పందించిన రాఘవ్ చద్దా "ఇది గిగ్ ఎకానమీ విజయగాథ కాదు. యాప్‌లు, అల్గారిథమ్‌ల చాటున దాగి ఉన్న వ్యవస్థీకృత దోపిడీ. రోజూ లక్షలాది మంది ఎదుర్కొంటున్న దుస్థితికి ఈ బ్లింకిట్ ఘటనే నిదర్శనం" అని ట్వీట్ చేశారు.

గిగ్ వర్కర్లు తక్కువ జీతాలు, కఠినమైన లక్ష్యాలు, ఉద్యోగ భద్రత లేమి, గౌరవం లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు వేగంగా విస్తరిస్తున్నా, కార్మిక చట్టాలు వాటికి అనుగుణంగా మారడం లేదన్నారు. "గిగ్ వర్కర్లకు సరైన వేతనాలు, మానవతా దృక్పథంతో కూడిన పని గంటలు, సామాజిక భద్రత కల్పించడం తప్పనిసరి" అని ఆయన డిమాండ్ చేశారు.

రాఘవ్ చద్దా పోస్ట్‌తో సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ మొదలైంది. కార్మిక చట్టాలు కాగితాలకే పరిమితం అయ్యాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఒకవేళ సొంత వాహనం వాడితే పెట్రోల్‌కు రోజుకు రూ.150-200 ఖర్చవుతుందని, చివరికి చేతికి మిగిలేది రోజుకు రూ.500-600 మాత్రమేనని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2020-21లో దేశంలో 77 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉండగా, 2029-30 నాటికి ఈ సంఖ్య 2.35 కోట్లకు పెరగనుంది. అయితే, కొత్త కార్మిక చట్టాల ద్వారా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా గిగ్ వర్కర్లను సామాజిక భద్రత పరిధిలోకి తెచ్చింది. దీని ద్వారా వారికి పీఎఫ్, ఈఎస్ఐసీ, బీమా వంటి ప్రయోజనాలు అందనున్నాయి.


More Telugu News