ఐపీఎల్‌లోకి కరీంనగర్ కుర్రాడు.. రాజస్థాన్ రాయల్స్‌కు ఎంపిక

  • ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన కరీంనగర్ యువ క్రికెటర్
  • వేలంలో రూ.30 లక్షలకు దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన అమన్‌రావు
  • అమన్‌రావు ఎంపికపై బండి సంజయ్, సునీల్‌రావు హర్షం
కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్ పేరాల అమన్‌రావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో చోటు దక్కించుకున్నాడు. మంగళవారం జరిగిన వేలంలో 21 ఏళ్ల అమన్‌రావును రూ. 30 లక్షలకు రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. జిల్లా యువకుడు ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఎంపిక కావడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌ అండర్‌-23 రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమన్‌రావు ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో 160 స్ట్రైక్‌ రేట్‌తో రెండు అర్ధ సెంచరీలు సాధించి ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. అమన్‌రావుది క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తండ్రి పేరాల మధుసూదన్‌రావు గతంలో జిల్లా స్థాయి క్రికెటర్‌గా ఆడారు. ఆయన తాత పేరాల గోపాల్‌రావు జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.

వీరి స్వగ్రామం సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి కాగా, కొన్నేళ్లుగా వీరి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. కరీంనగర్ బిడ్డ ఐపీఎల్‌కు ఎంపికవడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మేయర్‌ సునీల్‌రావులు హర్షం వ్యక్తం చేశారు.


More Telugu News