Nandamuri Balakrishna: రెండు పెద్ద సినిమాలు ఒకేసారి వద్దు.. తమ్ముడు పవన్ కల్యాణ్ కి దారి ఇచ్చేద్దాం అన్నారు: బాలయ్యపై బోయపాటి కామెంట్స్

Nandamuri Balakrishna Gave Way to Pawan Kalyan Says Boyapati Srinu
  • అఖండ-2... ఆసక్తికర అంశం వెల్లడించిన బోయపాటి
  • పవన్ 'ఓజీ' చిత్రంతో పోటీ వద్దనే సెప్టెంబరు 25న విడుదల వాయిదా వేశామని వెల్లడి
  • తమ్ముడికి దారిద్దామని బాలకృష్ణ సూచించినట్టు వెల్లడి
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2: ది తాండవం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 12న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

వాస్తవానికి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేసేందుకు తాము సిద్ధమయ్యామని, 135 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి కాపీ కూడా రెడీ చేశామని బోయపాటి తెలిపారు. అయితే, అదే సమయానికి పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమా కూడా విడుదలయ్యే అవకాశం ఉండటంతో తమ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ చూపిన పెద్ద మనసును బోయపాటి ప్రశంసించారు. “ఒకేసారి రెండు పెద్ద సినిమాలు వస్తే థియేటర్లు పంచుకోవాల్సి వస్తుంది. మన రాబడిని మనమే దెబ్బతీసుకున్నట్టు అవుతుంది. ఈ విషయం చెప్పగానే బాలయ్య గారు ‘తమ్ముడికి దారి ఇచ్చేద్దాం, మనం తర్వాత వద్దాం’ అని అన్నారు. ఆయన సూచనతోనే మేము వెనక్కి తగ్గాం” అని బోయపాటి వివరించారు. ఒక స్టార్ హీరో అయి ఉండి, మరో పెద్ద సినిమా కోసం తన చిత్రాన్ని వాయిదా వేయమనడం బాలకృష్ణ గొప్పతనానికి నిదర్శనమని ఆయన కొనియాడారు.

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం అఖండ-2, వాయిదా తర్వాత విడుదలై ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Nandamuri Balakrishna
Balakrishna
Akhanda 2
Boyapati Srinu
Pawan Kalyan
OG Movie
Telugu Cinema
Tollywood
Movie Release Date
Box Office Collections

More Telugu News