కొత్త కానిస్టేబుళ్లకు అపాయింట్ మెంట్ లెటర్స్ అందజేసిన చంద్రబాబు, పవన్

  • మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాల పంపిణీ
  • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా నియామక పత్రాలు
  • కేసులను అధిగమించి ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి
  • వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పోలీసుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు
  • ఈ నెల 22 నుంచి కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎంపికైన 5,757 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం మంగళగిరిలో మంగళవారం జరిగింది. మంగళగిరి ఏపీఎస్పీ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరై అభ్యర్థులకు ఉత్తర్వులు అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. "కానిస్టేబుల్ ఉద్యోగాలపై ఉన్న కేసులను అధిగమించి, నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించుతూ నియామకాలు పూర్తి చేశాం. మా ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి... వేరే వాళ్లు వస్తే పోతాయి" అని అన్నారు. తన హయాంలో గతంలో 23 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలు, మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని గుర్తుచేశారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావించారు. "ఆనాడు వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెబితే నేను కూడా నమ్మాను. కానీ ఆయన్ను దారుణంగా హత్య చేశారు. అక్కడికి వెళ్లిన సీఐ ఉన్నతాధికారులకు వాస్తవాలు చెప్పలేదు. ఆ తర్వాత 'నారాసుర రక్తచరిత్ర' అంటూ నాపైనే ప్రచారం చేసి 2019లో గెలిచారు. ఆ రోజు పోలీసులు అప్రమత్తంగా ఉండి ఉంటే నేను ఓడిపోయేవాడిని కాదు" అని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసే వారి పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత కూడా పాల్గొన్నారు. కొత్తగా నియమితులైన కానిస్టేబుళ్లకు ఈ నెల 22వ తేదీ నుంచి 9 నెలల పాటు శిక్షణ ప్రారంభం కానుంది.


More Telugu News