యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌ను కలవడం ఆనందదాయకం: సీఎం చంద్రబాబు

  • యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
  • ఆంధ్రప్రదేశ్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చ
  • వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, ఆవిష్కరణల వంటి అంశాలపై సంప్రదింపులు
  • అమెరికా సంస్థలకు ఏపీ నమ్మకమైన, భవిష్యత్-సిద్ధ భాగస్వామి అని స్పష్టం
  • భారత్-అమెరికా సంబంధాల్లో తెలుగు డయాస్పొరా పాత్ర కీలకమన్న సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, అమెరికా మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఇరువురి మధ్య పరస్పర ఆసక్తి ఉన్న పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

ఈ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, ఆవిష్కరణలు, ప్రజల మధ్య సంబంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. "యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ను కలవడం ఆనందదాయకం. బలమైన వ్యాపార పర్యావరణ వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన చైతన్యవంతమైన తెలుగు డయాస్పొరా కారణంగా భారత్-అమెరికా సంబంధాల్లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.

అమెరికా వ్యాపార సంస్థలకు, విద్యాసంస్థలకు ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ నమ్మకమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే భాగస్వామిగా కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమావేశం ఇరుపక్షాల మధ్య సంబంధాలను కొత్త పుంతలు తొక్కిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


More Telugu News