121 బంతుల్లోనే ద్విశతకం.. అభిజ్ఞాన్ కుందు విధ్వంసం.. అంబటి రాయుడు రికార్డు బ్రేక్‌

  • అండ‌ర్‌-19 ఆసియా కప్‌లో అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీ
  • కేవలం 121 బంతుల్లోనే ద్విశతకం బాదిన యువ క్రికెటర్
  • అంబటి రాయుడు 177 పరుగుల రికార్డు బ్రేక్
భారత యువ క్రికెటర్ అభిజ్ఞాన్ కుందు అండర్-19 ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇవాళ మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో అండర్-19 వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా అంబటి రాయుడు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన కుందు కేవలం 121 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ ద్వారా అంబటి రాయుడు (177) పేరిట చాలాకాలంగా ఉన్న రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా ఇదే టోర్నమెంట్‌లో వైభవ్ సూర్యవంశీ నెలకొల్పిన అత్యధిక వ్యక్తిగత స్కోరును కూడా కుందు దాటేశాడు.

మొత్తంగా 125 బంతుల్లో అజేయంగా 206 ర‌న్స్ బాదాడు. అత‌ని తుపాను ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 9 సిక్స‌ర్లు ఉన్నాయి.  కుందు విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో యువ భార‌త్ ఏడు వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. కుందుతో పాటు వేదాంత్ త్రివేది (90), వైభవ్ సూర్యవంశీ (50) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. 


More Telugu News