గాంధీ పేరును చెరిపేయడం మరో హత్యే: ప్రధాని మోదీపై షర్మిల ఫైర్

  • 'రామ్-జీ' పేరుతో పథకాన్ని ఆర్‌ఎస్‌ఎస్ స్కీమ్‌గా మారుస్తున్నారని షర్మిల ఫైర్
  • ఈ కుట్రను దేశమంతా తిప్పికొట్టాలని పిలుపు
  • మోదీ ఒక అభినవ గాడ్సే అని విమర్శ
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకం పేరు మార్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, మోదీని 'అభినవ గాడ్సే' అని, 'నాథూరామ్ గాడ్సే వారసుడు' అని తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

అప్పట్లో మహాత్ముడిని గాడ్సే భౌతికంగా హత్య చేస్తే, ఇప్పుడు మోదీ ఆయన పేరును, ఆశయాలను, సిద్ధాంతాలను తుడిచిపెట్టి మరో హత్యకు పాల్పడుతున్నారని షర్మిల ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి 'రామ్-జీ' (రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్) అని పేరు పెట్టి, దాన్ని ఆర్‌ఎస్‌ఎస్ స్కీమ్‌గా మార్చే కుట్ర జరుగుతోందని ఆమె దుయ్యబట్టారు. ఈ చర్య దేశ ద్రోహంతో సమానమని, ఎన్డీయే ప్రభుత్వం మహాత్ముడికి తీరని ద్రోహం చేస్తోందని పేర్కొన్నారు.

ఉన్నట్టుండి ఉపాధి హామీ పథకం పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని షర్మిల ప్రశ్నించారు. పనిదినాలు 100 నుంచి 125కి పెంచినందుకు గాంధీజీ పేరు తొలగిస్తారా? అని నిలదీశారు. మహాత్ముడి పేరు చెరిపేస్తే ఖర్చు తప్ప మోదీకి ఏం లాభమని, స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ప్రధానులంటే బీజేపీకి ఎందుకంత కోపమని ఆమె ప్రశ్నించారు.

ఉపాధి హామీ పథకానికి బాపూజీ పేరును మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను దేశమంతా ఏకమై తిప్పికొట్టాలని షర్మిల పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎంపీలందరూ పార్లమెంటులో ఈ బిల్లును వ్యతిరేకించాలని ఆమె కోరారు.


More Telugu News