Gym: జిమ్ లో బరువులు ఎత్తిన యువకుడికి మందగించిన కంటిచూపు.. కారణం చెప్పిన డాక్టర్

Healthy 27 Year Old Loses Vision Mid Workout Doctor Explains Rare Gym Injury Behind It
  • ఛాతీపై అధిక ఒత్తిడి పడితే తాత్కాలికంగా కళ్లు కనిపించవని వెల్లడి
  • కంటిలోని రెటీనాలో స్వల్ప రక్తస్రావమే కారణమని వైద్యుల వివరణ
  • సాధారణంగా దానికదే తగ్గిపోతుందని, కొన్నిసార్లు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వెల్లడి
జిమ్ లో కసరత్తులు చేస్తుండగా ఓ యువకుడికి ఉన్నట్టుండి కంటిచూపు మందగించింది. ఒక కన్ను బాగానే ఉన్నా మరొక కంటితో ఏమీ చూడలేకపోయాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లిన ఆ యువకుడికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ అసలు కారణం వెల్లడించారు. అధిక బరువులు ఎత్తిన సమయంలో ఛాతీపై తీవ్రమైన ఒత్తిడి పడడం వల్ల రెటీనాలో స్వల్ప రక్తస్రావం జరిగి చూపు మందగించిందని తెలిపారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని చెప్పారు.

ఢిల్లీలోని ఎయిమ్స్ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ ఆశిష్ మార్కాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అధిక బరువులు ఎత్తినప్పుడు కంటిచూపు తాత్కాలికంగా మందగించే అవకాశం ఉందని, దీనిని వాల్సల్వా రెటినోపతిగా వ్యవహరిస్తామని ఆయన వివరించారు. ఆరోగ్యవంతులకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు.

ఛాతీపై తీవ్రమైన ఒత్తిడి పడినపుడు కంటిచూపు మందగిస్తుందని, ఒక కంటికి కానీ, రెండు కళ్లకు కానీ సమస్య ఎదురవుతుందని చెప్పారు. వాల్సల్వా రెటీనోపతి అంటే.. రెటీనాలో రక్తస్రావం జరగడమని తెలిపారు. ఈ రక్తస్రావం కారణంగా కంటిచూపు బ్లర్ అవుతుందన్నారు. సాధారణంగా ఒకటి రెండు వారాల్లో కంటిచూపు సాధారణ స్థితికి చేరుకుంటుందని, అరుదైన సందర్భాలలో మాత్రమే శస్త్రచికిత్స చేయాల్సి వస్తుందని డాక్టర్ ఆశీష్ పేర్కొన్నారు.

రెటీనాలో రక్తస్రావం జరిగే సందర్భాలు..
బరువులు ఎత్తడంతో పాటు తీవ్రంగా దగ్గినపుడు, వాంతులు చేసుకున్నపుడు, మల విసర్జన సమయంలో లేదా ప్రసవ సమయంలో తీవ్రమైన ఒత్తిడి కలిగినపుడు, సంగీత వాయిద్యాలను బలంగా ఊదడం.. వంటి సందర్భాలలో రెటీనాలో రక్తస్రావం జరిగి చూపు మందగించే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు.
Gym
Vision Loss
Mid Workout
Retina
Rare Gym Injury
retinal bleeding

More Telugu News