సర్టిఫికెట్ అందజేస్తూ... మహిళ హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీశ్ కుమార్!

  • పాట్నాలో ఒక వైద్యురాలికి ఆయుష్ సర్టిఫికెట్ ఇచ్చిన సమయంలో ఘటన
  • విద్యార్థినికి సర్టిఫికెట్ చేతికిచ్చి హిజాబ్ కొంతమేర తొలగించిన ముఖ్యమంత్రి
  • సీఎం చర్యను ఆపే ప్రయత్నం చేసిన ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఒక కార్యక్రమంలో ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలు అందజేస్తుండగా ఒక మహిళ హిజాబ్‌ను లాగడం వివాదాస్పదమైంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. పా​​​​ట్నాలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఒక వైద్యురాలికి ఆయుష్ సర్టిఫికెట్‌ను ఆయన స్వయంగా అందజేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో 1,000 మంది ఆయుష్ వైద్యులకు సర్టిఫికెట్లను అందజేశారు.

ఒక విద్యార్థినికి సర్టిఫికెట్ చేతికిచ్చిన నితీశ్, ఆమె హిజాబ్‌ను కొంతమేర తొలగించారు. ముఖ్యమంత్రి చర్యకు ఆ మహిళ ఏ విధంగానూ స్పందించకపోయినా, నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయారు. అయితే, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌధరి మాత్రం ముఖ్యమంత్రి నితీశ్ చర్యను ఆపేందుకు ప్రయత్నించారు.

ముఖ్యమంత్రి చర్యపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నితీశ్‌కు పూర్తిగా మతిభ్రమించినట్లు ఉందని విరుచుకుపడింది. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మహిళల పట్ల జేడీయూ, బీజేపీ ప్రభుత్వం వైఖరి ఏమిటో ఈ ఉదంతం ద్వారా వెల్లడవుతోందని ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ పేర్కొన్నారు. గతంలో బీహార్ ఎన్నికల సమయంలోనూ నితీశ్ ఒక మహిళ మెడలో పూలదండ వేయడం వివాదాస్పదమైంది.


More Telugu News