పిల్లలకు డైపర్‌ల స్థానంలో ఈ-మ్యాట్.. ఏడో తరగతి విద్యార్థిని వినూత్న ఆవిష్కరణ

  • అసోంలోని సోనిత్‌పూర్ జిల్లా విద్యార్థిని హర్షిక ఆవిష్కరణ
  • 52వ జాతీయ బాలల సైన్స్ ఎగ్జిబిషన్‌లో అసోం నుంచి హర్షిక ప్రాతినిథ్యం
  • ఈ-మ్యాట్ పరికరాన్ని ప్రదర్శించిన హర్షిక
అసోంలోని సోనిత్‌పూర్ జిల్లా, ధేకియాజులిలోని నేతాజీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని హర్షిక అలమ్మయన్ ఒక వినూత్న ఆవిష్కరణతో రాష్ట్రానికి కీర్తి తెచ్చిపెట్టింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్టీ) మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇటీవల నిర్వహించిన 52వ జాతీయ బాలల సైన్స్ ఎగ్జిబిషన్ 2025లో హర్షిక అసోం నుంచి ప్రాతినిధ్యం వహించింది.

ప్రస్తుత కాలంలో చిన్నారుల్లో డైపర్ల వినియోగం పెరిగింది. ఈ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల్లో దద్దుర్లు, ఇతర ఇన్‌ఫెక్షన్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో హర్షిక ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపింది. చిన్నారులకు డైపర్ వేయాల్సిన అవసరం లేకుండా ఒక ఈ-మ్యాట్ పరికరాన్ని రూపొందించి ప్రదర్శించింది. ఇది సెన్సార్ల సహాయంతో పనిచేస్తుంది.

ఈ-మ్యాట్‌ను పిల్లల పరుపు కింద పరచాలి. వారు మల, మూత్ర విసర్జన చేసినప్పుడు, అది తేమను గ్రహించి వెంటనే శబ్దం లేదా వైబ్రేషన్‌తో అప్రమత్తం చేస్తుంది. దీంతో వెంటనే శుభ్రపరిచే చర్యలు చేపట్టవచ్చు. ఈ మ్యాట్ సురక్షితమని, పునర్వినియోగానికి అనుకూలమని హర్షిక తెలిపింది. ఈ ప్రాజెక్టు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వాహకులను విశేషంగా ఆకట్టుకుంది.


More Telugu News