'నో హెల్మెట్ - నో పెట్రోల్' నిబంధనను తీసుకురావడం మంచి ఆలోచన: సీఎం చంద్రబాబు

  • హెల్మెట్ వాడకంపై తిరుపతి పోలీసుల చర్యలను మెచ్చుకున్న సీఎం
  • "నో హెల్మెట్ – నో పెట్రోల్" నిబంధన మంచి ఆలోచనన్న చంద్రబాబు
  • 700 మంది పోలీసులతో బైక్ ర్యాలీ నిర్వహణను అభినందించిన సీఎం
  • ర్యాలీలో స్వయంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ
  • ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ప్రజలకు సీఎం విజ్ఞప్తి
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం 'నో హెల్మెట్ – నో పెట్రోల్' నిబంధనను తీసుకురావడం హర్షణీయమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడే ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఈ నిబంధనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు 700 మంది పోలీస్ సిబ్బందితో భారీ ఎత్తున హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించడాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు స్వయంగా పాల్గొనడం ద్వారా ప్రజలకు మంచి సందేశం ఇచ్చారని కొనియాడారు. ఉన్నతాధికారుల భాగస్వామ్యం సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు, ప్రజల్లో కూడా బాధ్యతను పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రజల భద్రత కోసం ప్రభుత్వం తీసుకువచ్చే నిబంధనలు, సూచనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఉన్నతాధికారులకు సూచించారు.


More Telugu News