దేవుడికి విశ్రాంతి సమయంలోనూ ప్రత్యేక పూజలు.. సుప్రీంకోర్టు అసహనం

  • బాంకీ బీహారీజీ మహారాజ్ ఆలయంలో దర్శన సమయాల్లో మార్పు
  • దేవుడికి విశ్రాంతి సమయంలో ప్రత్యేక పూజలు ఏమిటని సుప్రీంకోర్టు ఆగ్రహం
  • దేవుడికి విశ్రాంతి వేళలు ఉంటాయన్న సుప్రీంకోర్టు
ఉత్తరప్రదేశ్‌లోని మధుర బాంకీ బీహారీజీ మహారాజ్ ఆలయంలో దర్శన సమయాల మార్పుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దేవుడికి విశ్రాంతి సమయంలో ప్రత్యేక పూజలు చేయడమేమిటని ప్రశ్నించింది. ఇక్కడి ఆలయం దర్శన వేళలు, పూజా విధానాల్లో మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం భక్తుల నుంచి డబ్బులు తీసుకుని ప్రత్యేక పూజలు చేయడాన్ని తప్పుబట్టింది.

దేవుని విశ్రాంతి వేళల్లో ప్రత్యేక పూజలు చేయడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో దర్యాప్తునకు ఉన్నతస్థాయి ఆలయ నిర్వహణ కమిటీని నియమించింది.

బాంకీ బీహారీజీ ఆలయంలో దర్శన వేళల్లోనే కాకుండా పలు మతపరమైన పూజా విధానాల్లోనూ మార్పులు చేస్తున్నట్లు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్, న్యాయవాది తన్వి దూబే అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం దేవుడికి విశ్రాంతి వేళలు ఉంటాయని, కానీ ఆ సమయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆలయ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుడికి విశ్రాంతినివ్వకుండా ప్రత్యేక పూజలు చేయడమేమిటని ప్రశ్నించింది. అనాదిగా వస్తున్న నియమాలను, పద్ధతులను, దర్శన సమయాలను పాటించాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.


More Telugu News