ఏపీ ప్రాజెక్టులకు కేంద్రం అండ... మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ కీలక భేటీ

  • కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి నారా లోకేశ్‌ భేటీ
  • రాష్ట్రవ్యాప్త నైపుణ్య గణనకు సహకరించాలని విజ్ఞప్తి
  • రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు మద్దతు కోరిన లోకేశ్‌
  • ఏపీలో ఏఐ మిషన్ వేగవంతానికి సాయంపై కీలక చర్చ
  • లోకేశ్‌ వినతులకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి
రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపట్టనున్న పలు కీలక ఐటీ, నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. లోకేశ్‌ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

ఈ సమావేశంలో రాష్ట్రంలో చేపట్టనున్న నైపుణ్య గణన కోసం ఏఐ టెక్నాలజీతో రూపొందించిన 'నైపుణ్యం పోర్టల్' గురించి లోకేశ్‌ కేంద్ర మంత్రికి వివరించారు. ఇప్పటికే మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించామని, ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు ఏఐ ఆధారిత ఇంటర్వ్యూ విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే ఈ బృహత్ కార్యక్రమానికి కేంద్రం సహాయం అందించాలని కోరారు.

అలాగే రాష్ట్రంలోని యువ పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు కేంద్రం అండగా నిలవాలని లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఐటీ శాఖ పరిధిలోని 'MeitY స్టార్టప్ హబ్' ద్వారా మద్దతు అందించాలని కోరారు. ఇదే హబ్‌లో యానిమేషన్, ఏఆర్/వీఆర్ వంటి అత్యాధునిక టెక్నాలజీస్ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కూడా సహకరించాలని విన్నవించారు.

ఇండియా ఏఐ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో కృత్రిమ మేధ (ఏఐ) విస్తరణను వేగవంతం చేసేందుకు మద్దతివ్వాలని కోరారు. ఈ భేటీలో లోకేశ్‌ వెంట కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎంపీలు కూడా ఉన్నారు.



More Telugu News