పొగమంచు ఎఫెక్ట్ .. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఆలస్యం

  • ఢిల్లీలో పొగమంచుతో ప్రధాని మోదీ పర్యటన ఆలస్యం
  • మూడు దేశాల పర్యటనకు బయల్దేరాల్సి ఉండగా జాప్యం
  • ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసుల రద్దు
  • ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసిన విమానయాన సంస్థలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనకు సోమవారం ఉదయం బయలుదేరాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జాప్యం నెలకొంది. దట్టమైన పొగమంచు దేశ రాజధాని ఢిల్లీని కమ్మేయడంతో ఆయన ప్రయాణించాల్సిన విమానం టేకాఫ్ ఆలస్యమైంది.

షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటన కోసం సోమవారం ఉదయం 8:30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే విమానాశ్రయంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రధాని పర్యటన ఆలస్యమైనట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు ఈ పొగమంచు ప్రభావం కేవలం ప్రధాని పర్యటనపైనే కాకుండా ఢిల్లీ విమానాశ్రయంలోని సాధారణ విమాన సర్వీసులపై కూడా తీవ్రంగా పడింది. ఉదయం నుంచి పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. విజిబిలిటీ గణనీయంగా తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని వారు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఇండిగో, ఎయిరిండియా వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు జారీ చేశాయి. పలు విమానాలను రద్దు చేస్తున్నామని, మరికొన్ని ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించాయి. ప్రయాణికులు తమ విమానాల స్టేటస్‌ను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లలో చూసుకోవాలని సూచించాయి. ప్రయాణంలో కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలుపుతూ, ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని ఆ సంస్థలు స్పష్టం చేశాయి. 


More Telugu News