నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన

  • జోర్డాన్, ఇథియోపియా, ఒమన్‌లలో కీలక భేటీలు
  • భారత్-జోర్డాన్ దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు  
  • ప్రధాని హోదాలో తొలిసారి ఇథియోపియాకు నరేంద్ర మోదీ
  • ఒమన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్షించనున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జోర్డాన్, ఇథియోపియా, ఒమన్‌ దేశాలలో పర్యటించి ఆయా దేశాల అగ్ర నాయకులతో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం.
 
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రధాని తన పర్యటనలో భాగంగా మొదట జోర్డాన్ చేరుకుంటారు. ఆ దేశ రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు అక్కడ రెండు రోజులు పర్యటిస్తారు. భారత్, జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇరు దేశాల మధ్య సహకారం, ప్రాంతీయ శాంతి, భద్రత వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.
 
అనంతరం మంగళవారం ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటిస్తారు. ప్రధాని హోదాలో మోదీ ఇథియోపియాకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య మైత్రి, సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై చర్చిస్తారు.
 
చివరిగా, డిసెంబర్ 17, 18 తేదీలలో ప్రధాని ఒమన్‌లో పర్యటిస్తారు. ఒమన్ సుల్తాన్ హైదర్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ పర్యటన జరగనుంది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, భద్రత వంటి పలు రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ప్రధాని మోదీ ఒమన్‌లో పర్యటించడం ఇది రెండోసారి.


More Telugu News