వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు విదేశీ ఫ్యామిలీ ఫిదా.. వీడియో ఇదిగో!

  • వందే భారత్ రైలులో ప్రయాణించిన విదేశీ కుటుంబం
  • రైల్లోని సౌకర్యాలపై ప్రశంసలు కురిపిస్తూ వీడియో పోస్ట్
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వారి పాజిటివ్ రివ్యూ
  • భారత్ అభివృద్ధిని చూపారంటూ నెటిజన్ల హర్షం
ప్రపంచ యాత్ర చేస్తున్న ఒక విదేశీ కుటుంబం (ది హచిన్‌సన్స్) భారతీయ రైల్వేపై ప్రశంసలు కురిపించింది. వారు ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లేందుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించారు. ఈ ప్రయాణ అనుభవాన్ని వీడియో తీసి తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. 

ఆ వీడియోలో ఆ కుటుంబంలోని మహిళ వందే భారత్ రైలులోని సౌకర్యాలను చూపించారు. శుభ్రంగా ఉన్న ఇండియన్, వెస్ట్రన్ స్టైల్ వాష్‌రూమ్‌లు, ప్రశాంతమైన వాతావరణం, సౌకర్యవంతమైన సీట్లు, వాటి కింద ఉన్న ఛార్జింగ్ సాకెట్లు, ఉచితంగా అందించిన వాటర్ బాటిళ్లు, లగేజీ పెట్టుకోవడానికి విశాలమైన స్థలం వంటివి చూపించారు. ఈ అనుభవం ఎంతో బాగుందని పేర్కొన్నారు.

"మేము దాదాపు రైలును మిస్సయ్యామనే అనుకున్నాం. లగేజీతో పరుగెత్తి చివరికి అందుకున్నాం. ఈ నాలుగు గంటల ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంది" అని వారు తమ పోస్ట్‌కు క్యాప్షన్ జోడించారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. "భారత్‌లోని పేదరికాన్ని మాత్రమే చూపే కొందరు విదేశీయుల్లా కాకుండా, మీరు దేశంలోని అభివృద్ధిని చూపినందుకు ధన్యవాదాలు" అని ఒకరు కామెంట్ చేశారు. "భారత్ ఇప్పుడు పాతది కాదు, ఇది మారుతోంది" అని కొందరు, "ఈ అద్భుతమైన అభివృద్ధికి ప్రభుత్వానికి ధన్యవాదాలు" అంటూ మరికొందరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 

తరచుగా కొందరు విదేశీ వ్లాగర్లు దేశం గురించి తప్పుడు అభిప్రాయం కలిగించేలా వీడియోలు చేస్తుంటారనే విమర్శల నేపథ్యంలో, ఈ కుటుంబం చేసిన నిజాయతీ సమీక్ష అందరినీ ఆకట్టుకుంటోంది.


More Telugu News