ప్రపంచ రికార్డు సృష్టించిన హార్దిక్.. ఎలైట్ ఆల్‌రౌండర్ల జాబితాలో చోటు

  • టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న హార్దిక్ పాండ్యా
  • ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా గుర్తింపు
  • 1000 పరుగులు, 100 సిక్సులు, 100 వికెట్ల ఎలైట్ క్లబ్‌లో చేరిక
  • ఈ రికార్డు అందుకున్న తొలి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా చరిత్ర
  • దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్న పాండ్యా
భారత స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఒక వికెట్ తీయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ (109), జస్ప్రీత్ బుమ్రా (101) సరసన నిలిచాడు.

ప్ర‌పంచంలోనే నాలుగో ఆటగాడిగా అరుదైన ఘ‌న‌త‌
ఈ మైలురాయితో పాండ్యా ప్రపంచంలోని ఓ ఎలైట్ ఆల్‌రౌండర్ల క్లబ్‌లో చేరాడు. టీ20 ఫార్మాట్‌లో 1000కి పైగా పరుగులు, 100కి పైగా సిక్సులు, 100కి పైగా వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతని కంటే ముందు జింబాబ్వేకి చెందిన సికందర్ రజా, ఆఫ్ఘ‌నిస్థాన్ ఆటగాడు మహ్మద్ నబీ, మలేషియాకు చెందిన వీరన్‌దీప్ సింగ్ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. అంతేకాకుండా 1000 పరుగులు, 100 వికెట్లు పూర్తి చేసిన తొలి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ రికార్డు సృష్టించడం విశేషం.

హార్దిక్ తన టీ20 కెరీర్‌లో 123 మ్యాచ్‌లలో 26.78 సగటుతో 100 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 122 మ్యాచ్‌లలో 1,939 పరుగులు చేశాడు. ఇందులో ఆరు అర్ధశతకాలతో పాటు 101 సిక్సులు ఉన్నాయి.


More Telugu News