నేడు ఢిల్లీలో మంత్రి నారా లోకేశ్ పర్యటన

  • కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ కానున్న లోకేశ్
  • ఈ నెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన
  • రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రంతో చర్చలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు (సోమవారం) హస్తినలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో వేర్వేరుగా సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై వారిద్దరితో లోకేశ్ చర్చించనున్నారు. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఈ రోజు ఉదయం విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్న లోకేశ్..కేంద్ర మంత్రులతో సమావేశాలు ముగిసిన వెంటనే నేరుగా విశాఖపట్నం వెళ్లనున్నారు. రేపు విశాఖలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
 
మరోవైపు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం ఈ నెల 19న ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన 18వ తేదీ సాయంత్రమే విజయవాడ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. తన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి చర్చించనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల చివరి రోజైన డిసెంబర్ 19న చంద్రబాబు పర్యటన జరగనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 


More Telugu News