యశస్వి జైస్వాల్ విధ్వంసం.. మెరుపు సెంచరీతో ముంబైకి చారిత్రక విజయం

  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 48 బంతుల్లోనే శ‌త‌కం బాదిన యశస్వి 
  • 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ముంబై
  • టోర్నీ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్
  • కేవలం 25 బంతుల్లో 64 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్
  • ఏడాదిగా టీమిండియా టీ20 జట్టుకు దూరంగా ఉన్న జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తనదైన శైలిలో చెలరేగి, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హర్యానాతో ఇవాళ‌ జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో అదరగొట్టాడు. జైస్వాల్ విధ్వంసానికి, సర్ఫరాజ్ ఖాన్ మెరుపులు తోడవడంతో ముంబై జట్టు 235 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

అంబిలోని డీవై పాటిల్ అకాడమీలో జరిగిన ఈ సూపర్ లీగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా 3 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ అంకిత్ కుమార్ (89), నిశాంత్ సింధు (63 నాటౌట్) అద్భుతంగా రాణించారు. అయితే, ఈ భారీ లక్ష్య ఛేదనలో జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 48 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, మొత్తం 101 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. దీంతో ముంబై కేవలం 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. టోర్నీ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ కావడం విశేషం.

గత ఏడాది కాలంగా భారత టీ20 జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న జైస్వాల్‌కు ఈ సెంచరీ ఎంతో కీలకం. టెస్టుల్లో స్థానం సుస్థిరం చేసుకున్నప్పటికీ, టీ20ల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ఇన్నింగ్స్ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించేలా ఉంది. ఇది అతనికి టీ20 కెరీర్‌లో నాలుగో శతకం. సర్ఫరాజ్ ఖాన్ కూడా కేవలం 25 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరి మధ్య 88 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పింది.


More Telugu News