తెలంగాణ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాం: సీఎం రేవంత్ రెడ్డి

  • హైదరాబాద్‌లో మెస్సీ టూర్ విజయవంతంపై సీఎం రేవంత్ హర్షం
  • తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పామన్న ముఖ్యమంత్రి 
  • దిగ్గజ క్రీడాకారులు మెస్సీ, లూయిస్ సువారెజ్‌ల‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
  • సహకరించిన అధికారులు, సిబ్బంది, అభిమానులకు ధన్యవాదాలు
  • కార్యక్రమానికి హాజరైన రాహుల్ గాంధీకి సీఎం ప్రత్యేక ధన్యవాదాలు
హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన విజయవంతం కావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ అంటే క్రీడలు, తెలంగాణ అంటే శ్రేష్ఠత, తెలంగాణ అంటే ఆతిథ్యం అని ప్రపంచానికి చాటి చెప్పామని ఆయన అన్నారు. ఈ మెగా ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "మా ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్ నగరానికి విచ్చేసి క్రీడాభిమానులను, ముఖ్యంగా యువతను ఉత్సాహపరిచిన ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, లూయిస్ సువారెజ్‌, రోడ్రిగో డి పాల్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరై, ఈ సాయంత్రాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు శ్రమించిన నగరంలోని అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. వచ్చిన అతిథులకు అత్యుత్తమ ఆతిథ్యం అందించడంలో క్రమశిక్షణతో వ్యవహరించిన క్రీడాభిమానులకు, ప్రజలకు ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ సత్తాను ప్రపంచానికి చూపించేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 


More Telugu News